ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం ఏమందంటే?

by Shamantha N |
ప్రధాని మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం ఏమందంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. రష్యాతో స్నేహం కొనసాగింపుపైనా తమ ఆందోళనలు తెలియజేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. భారత్‌ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపారు. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర, స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. పుతిన్‌తో జరిగే చర్చల్లో ఉక్రెయిన్‌ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోడీకి సూచించారు. రష్యా తీసుకునే ఏ నిర్ణయమైనా.. ఉక్రెయిన్‌ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐక్యరాజ్యసమితి చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్ కు వివరించాలని చెప్పారు. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా కోరేది ఇదేనని అన్నారు.

రష్యా పర్యటనలో మోడీ

ఇకపోతే, మోడీ సోమవారం రష్యా పర్యటనకు వెళ్లారు. ఆ తర్వాత మోడీకి పుతిన్ తన అధికారిక నివాసంలో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోడీని పుతిన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. దేశం,దేశ ప్రయోజనాల కోసం జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. మరోవైపు, ఉక్రెయిన్ పై యుద్ధం విషయంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యాతో వాణిజ్య, వ్యాపార సంబంధాలపై నిషేధం విధించాయి. కానీ.. భారత్ మాత్రం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేసింది.

Advertisement

Next Story