భద్రతామండలిలో సభ్యదేశాల విస్తరణ అవసరం- భారత్

by Shamantha N |
భద్రతామండలిలో సభ్యదేశాల విస్తరణ అవసరం- భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి భద్రతా మండిలలో శాశ్వత, అశాశ్వత సభ్యత్వ కేటగిరీలను విస్తరించాలని కోరింది భారత్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇంటర్ గవర్నమెంటర్ నెగోషియేషన్స్ సమావేశం జరిగింది. ఆ భేటీలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ పాల్గొన్నారు. శాశ్వత, అశాశ్వత విభాగాలు రెండింటిలో భారత్ కు సభ్యత్వం కల్పించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత చట్టబద్ధంగా, ప్రాతినిధ్యపరంగా, జవాబుదారీతనంగా, సమర్థవంతంగా తీర్చిదిద్ది నిజమైన సంస్కరణలు తీసుకురావాలని భారత్ ఆకాంక్షించింది.

ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావాలని, 15 మంది సభ్యులు గల భద్రతా మండలిలో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండు ఉంది. దక్షిణాసియా దేశాల తరఫున భారత్ ఈ వాదనలు వినిపిస్తోంది. ఇకపోతే, శాశ్వత సీట్లు పెంచాలనే అభ్యర్థనకు మెజారిటీ దేశాల మద్దతు ఉందని తెలిపింది భారత్.

ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన అనేక దేశాలతోసహా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వాన్ని కోరుతున్నాయని భారత రాయబారి తెలిపారు. ఇందుకు భద్రతా మండలి విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా శాశ్వత సభ్యులుగా మరో 10 దేశాలు అశాశ్వత సభ్యులుగా ఉన్నాయి.

భద్రతామండలి శాశ్వత సభ్యత్వం విస్తరణ 'ప్రజాస్వామ్య విరుద్ధం' అని కొన్ని దేశాలు అంటున్నాయని పేర్కొన్నారు రుచిరా కాంబోజ్. మెజారిటీ సభ్యులు స్పష్టం చేసిన విషయం అప్రజాస్వామికమని అనుకోలేమని.. పాక్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు, శాశ్వత సభ్యత్వ దేశాల విస్తరణను పాక్, చైనాలతో కూడిన యూనైటింగ్ ఫర్ కాన్సెన్సస్ గ్రూప్ వ్యతిరేకిస్తోంది.

భద్రతా మండలి సంస్కరణల కోసం గత నెలలో జీ4 దేశాల తరఫున భారత్ వివరణాత్మక నమూనాను సమర్పించింది. ఆరుగురు శాశ్వత, నలుగురు లేదా ఐదుగురు అశాశ్వత సభ్యులను చేర్చడం ద్వారా భద్రతామండలి సభ్యత్వాన్ని 15 నుంచి 25-26కి పెంచాలని ప్రతిపాదించింది. భద్రతా మండలి ప్రస్తుత నిర్మాణం సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించదనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం అంగీకరిస్తోందని తెలిపారు రుచిరా కాంబోజ్. దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed