'ఢిల్లీ చీఫ్ సెక్రెటరీని పదవి నుంచి తప్పించండి'.. లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు సీఎం కేజ్రీవాల్ నివేదిక

by Vinod kumar |
ఢిల్లీ చీఫ్ సెక్రెటరీని పదవి నుంచి తప్పించండి.. లెఫ్టినెంట్ గవర్నర్‌‌కు సీఎం కేజ్రీవాల్ నివేదిక
X

న్యూఢిల్లీ : రూ.353 కోట్ల భూకుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్ సూత్రధారిగా వ్యవహరించారని ఆరోపిస్తూ.. 670 పేజీల సుదీర్ఘ దర్యాప్తు నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సేనాకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం పంపించారు. చీఫ్ సెక్రెటరీ అవినీతికి పాల్పడ్డారని నిరూపించే పలు ప్రాథమిక ఆధారాలను ఢిల్లీ విజిలెన్స్ శాఖ మంత్రి అతిషి నిర్వహించిన దర్యాప్తులో సేకరించామని ఆ నివేదికలో ప్రస్తావించారు. దీని కాపీలను సీబీఐ, ఈడీలకు కూడా కేజ్రీవాల్ పంపించారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర దర్యాప్తు సంస్థల దాకా చేరినందున చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్‌ను పదవి నుంచి సస్పెండ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్‌‌ను ఆయన కోరారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కోసం నేషనల్ హైవేస్ అథారిటీకి ఢిల్లీ నగరంలోని నైరుతి ప్రాంతంలో ఉన్న 19 ఎకరాల స్థలం అవసరమైంది.

అనంత్ రాజ్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ఈ ల్యాండ్ అమ్మకపు ధరను రూ. 41.52 కోట్లుగా అప్పటి (2018 నాటి) జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. అయితే దాన్ని ఆ తర్వాత అనూహ్యంగా రూ.353.79 కోట్లకు సౌత్ వెస్ట్ ఢిల్లీ జిల్లా కలెక్టర్ హేమంత్ కుమార్ పెంచేశారు. ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో అనంతరం ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో భూమి అమ్మకం ఆర్డర్ ఆగిపోయింది.

వాస్తవానికి కలెక్టర్ హేమంత్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఢిల్లీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నరేష్ కుమార్ ఉన్నారని ఆప్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నరేష్ కుమార్ కుమారుడు కరణ్ ‘బిగ్ టౌన్ ప్రాపర్టీస్’ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రమోటర్‌గా ఉన్నారు. ‘అనంత్ రాజ్ లిమిటెడ్’‌లోనూ కరణ్ డైరెక్టర్‌గా ఉన్నారని గుర్తించారు. ‘బిగ్ టౌన్ ప్రాపర్టీస్’, ‘అనంత్ రాజ్ లిమిటెడ్’ సంస్థలకు ఒకే విధమైన ఈమెయిల్ అడ్రస్‌లు, ఆఫీసు అడ్రస్‌లు ఉన్నాయని తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం కేజ్రీవాల్ పంపిన నివేదికలో ప్రస్తావించారు.

Advertisement

Next Story

Most Viewed