రాహుల్ గాంధీ పోటీ చేయబోయే స్థానంపై కీలక అప్ డేట్

by Prasad Jukanti |
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. రేపు ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగబోతున్నది. ఈ సమావేశం అనంతరం తొలిజాబితా అనౌన్స్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తున్న వేళ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర నేతలు కోరుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పోటీ పై యూపీలోని అమేఠీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాలు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ యూపీలోని అమేఠీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేస్తారని ఆయన చెప్పారు. ఆయన తన ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాతే ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఆసక్తిని రేపుతున్నాయి.

టీకాంగ్రెస్ నేతలకు రూట్ క్లియర్:

తెలంగాణలో ఎవరెవరికి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కపోతున్నదనే చర్చ ఉత్కంఠగా మారింది. మహబూబ్ నగర్ లో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్ రెడ్డే పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ ఖమ్మం, లేదా నల్గొండ, భువనగిరి స్థానాలలో ఎదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రం నుంచి పోటీకి దిగితే భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని కొంత మంది టీ కాంగ్రెస్ నేతలు సైతం వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాహుల్ మాత్రం గతంలో పోటీ చేసిన అమేఠీ, వయానాడ్ నుంచే పోటీ చేయబోతున్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ఇదే నిర్ణయం తీసుకుంటే మరి ఖమ్మం, నల్గొండ, భువనగిరి స్థానాల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులకు రూట్ క్లియర్ అయినట్లేననే చర్చ జోరుగా జరుగుతోంది. మరి అంతిమంగా ఈ స్థానాల్లో పార్టీ ఎవరిని బరిలోకి దింపబోతున్నది అనేది త్వరలోనే తేలనున్నది.

Advertisement

Next Story