Imo Singh: మణిపూర్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోండి.. అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే లేఖ

by vinod kumar |
Imo Singh: మణిపూర్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోండి.. అమిత్ షాకు బీజేపీ ఎమ్మెల్యే లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఇమో సింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. జాతి కలహాలతో దెబ్బతిన్న రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు రాష్ట్ర భద్రతా సిబ్బందికి అనుమతివ్వాలని కోరారు. ఈ మేరకు సోమవారం అమిత్ షాకు ఓ లేఖ రాశారు. ‘మణిపూర్‌లో దాదాపు 60,000 మంది కేంద్ర బలగాలు ఉన్నాయి. కానీ వారంతా మూగ ప్రేక్షకుల్లా మారారు. హింసను నియంత్రించడంలో విఫలమయ్యారు. కాబట్టి బలగాలను రాష్ట్రం నుంచి తొలగించడమే మంచిది’ అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు సహకరించని అస్సాం రైఫిల్స్‌లోని కొన్ని యూనిట్లను తొలగించే చర్య పట్ల మేము సంతోషిస్తున్నాం. అలాగే ఇతర కేంద్ర బలగాల సైతం హింసను ఆపలేకపోతే, వాటిని తొలగించి రాష్ట్రంలోని పోలీసులకు అనుమతివ్వాలి’ అని తెలిపారు.

జాతి వివాదం ఎక్కువ కాలం కొనసాగడం మంచిది కాదని వెల్లడించారు. అక్రమ ఆయుధాల సరఫరా కారణంగా ఇది దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగుతోందని దీనిని అరికట్టాలని తెలిపారు. యూనిఫైడ్ కమాండ్ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు కేంద్రం తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభం కేవలం ప్రాంతీయ సమస్య కాదని, దేశ భద్రతకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. కాగా, ఆదివారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌత్రుక్, దాని పరిసర ప్రాంతాలలో మిలిటెంట్లు జరిపిన దాడిలో ఒక మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కుమార్ అమిత్ షాకు లేఖ రాయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed