Hamas : ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎలా వ్యవహరించాలో ప్రణాళికలు ఉన్నాయి

by Shamantha N |
Hamas : ఇజ్రాయెల్ దాడి చేస్తే ఎలా వ్యవహరించాలో ప్రణాళికలు ఉన్నాయి
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ గాజాలోని రఫా సొరంగం నుంచి ఆరుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఇజ్రాయెల్ చెరలో ఉన్న బందీల మృతిపై ఆగ్రహం వ్యక్తమవుతుండగా.. హమాస్ స్పందించింది. దీనిపై, సరికొత్త ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ దళాలు తమ స్థావరాల్లోకి దూసుకొచ్చినప్పుడు అక్కడున్న బందీలతో ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి సూచనలు రూపొందించినట్లు హమాస్ ప్రతినిధి అబు ఉబైదా వెల్లడించారు. వాటిని ఇప్పటికే అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గతంలో భారీ ఆపరేషన్‌ చేపట్టిన ఇజ్రాయెల్‌ నలుగురు బందీలను రక్షించింది. అప్పుడు 274 మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే ఆ సూచనలను రూపొందించినట్లు చెప్పారు. ‘‘నసెయిరత్ లో జరిగిన ఘటన తర్వాత ఖైదీల బాధ్యతలు చూస్తోన్న ముజాహిద్దీన్‌లకు ఈ ఆదేశాలు ఇచ్చాం. బందీలను ఉంచిన స్థావరాల వద్దకు ఇజ్రాయెల్‌ సైన్యం వస్తే.. ఎలా వ్యవహరించాలో వాటిలో వివరించాం’’ అని తెలిపారు. అయితే వాటికి సంబంధించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

నెతన్యాహుపై విమర్శలు

బందీల మరణాలపై హమాస్ నేత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)పై అబు ఉబైదా మండిపడ్డారు. చర్చలు చేపట్టకుండా మిలిటరీ ఆపరేషన్‌నే కొనసాగిస్తున్నారని విమర్శించారు. సైనిక ఒత్తిడి ద్వారా బందీలను విడిపించాలనే ఆయన పట్టుబడుతున్నారన్నారు. వారు సజీవంగా రావాలా..? విగతజీవులుగా రావాలా..? అనేది బందీల కుటుంబాలే తేల్చుకోవాలంటూ హెచ్చరించారు. ఆరుగులు బందీలు చనిపోవడంతో.. నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ లో భారీ నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది పరోక్షంగా హమాస్‌కు మద్దతివ్వడమేనంటూ ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం నెతన్యాహు తీరుపై మండిపడ్డారు. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని హితవు పలికారు.

Advertisement

Next Story

Most Viewed