మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్‌గా మోడీ.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారంటే..?

by Swamyn |
మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్‌గా మోడీ.. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారంటే..?
X

దిశ, నేషనల్ బ్యూరో: మరికొన్ని వారాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ జాతీయ మీడియా సంస్థ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’.. అత్యంత శక్తివంతమైన 100 మంది భారతీయుల జాబితాను గురువారం విడుదల చేసింది. ‘ఐఈ- 100: 2024’ పేరిట విడుదల చేసిన ఈ జాబితాలో ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారు. రాజకీయం, వ్యాపారం, క్రీడలు, సినిమా వంటి అన్ని రంగాల్లో కలిపి ఈ నివేదికను రూపొందించగా, ప్రధాని మోడీ మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్‌గా నిలిచారు. ఈ జాబితాలో ప్రధాని అగ్రస్థానంలో నిలవడానికి గల కారణాలనూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు దేశాన్ని పాలించిన మోడీ.. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో భారీ ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారని తెలిపింది. దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రధాని కూడా ఇంత భారీ ప్రజాదరణతో ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టలేదని పేర్కొంది. ‘బీజేపీ ప్రభుత్వం తమ రెండు పర్యాయాల్లో సంక్షేమాన్ని పెంచింది. వృద్ధిని మెరుగుపర్చింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంతోపాటు ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. ఇవేకాకుండా, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర ప్రతిష్ట వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. అయితే, అధికార కేంద్రీకరణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, స్వయం ప్రతిపత్తి సంస్థలను అణగదొక్కడం, ప్రభుత్వంలో మైనారిటీల ప్రాతినిధ్యం వంటి అంశాల్లో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది’ అని నివేదిక వెల్లడించింది.

టాప్-10లో ఏడుగురు బీజేపీ నుంచే..

మోడీ తర్వాత దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన భారతీయుడిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిలిచారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మూడో స్థానంలో ఉండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లు వరుసగా మూడు, నాలుగో స్థానంలో ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్(6వ స్థానం), కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(7), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (8), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(9), వ్యాపార వేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(10) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వీరిలో సీజేఐ డీవై చంద్రచూడ్, మోహన్ భగవత్, గౌతమ్ అదానీ మినహా టాప్-10లో ఏకంగా ఏడుగురు బీజేపీ నుంచే ఉండటం గమనార్హం. మోహన్ భగవత్ కూడా బీజేపీ అనుబంధ ఆరెస్సెస్ సర్‌సంఘ్‌చాలకే కావడం గమనార్హం. కాగా, ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ ముందు వరుసలో ఉండగా, మహిళల్లో నిర్మలా సీతారామన్, వ్యాపారస్థుల్లో గౌతమ్ అదానీ అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో తమ పోటీదారులకంటే మెరుగైన స్థానంలో ఉండటం విశేషం.

సినిమాల్లో షారుఖ్, క్రీడల్లో కోహ్లీ

మోస్ట్ పవర్‌ఫుల్ ఇండియన్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రముఖుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 11వ స్థానంలో ఉండగా, అసోం సీఎం హిమంత శర్మ(14వ స్థానం), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(15), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(16), జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(17), ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(18), ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్(19), కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (22), బిహార్ సీఎం నితీశ్ కుమార్ (24), తమిళనాడు సీఎం స్టాలిన్ (25), రిలయన్స్ చైర్‌పర్సన్ నీతా అంబానీ(26), బాలివుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ (27), కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ (29), బీసీసీఐ సెక్రెటరీ జై షా (35), కాంగ్రెస్ చీఫ్ ఖర్గే (36), విప్రో ఫౌండర్ అజిమ్ ప్రేమ్‌జీ (37), టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ(38), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (39), మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర(43), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(47), మహారాష్ట్ర సీఎం షిండే(48), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (49) ఉన్నారు. ఈ జాబితాలో రాహుల్ గాంధీ(16), సోనియా గాంధీ(29)ల కంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(15) మెరుగైన స్థానంలో ఉండటం గమనార్హం. ఇక, సినిమా రంగంలో బాలివుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(27), క్రీడారంగంలో విరాట్ కోహ్లీ (38) 50లోపు స్థానాలకు దక్కించుకుని తమ తమ రంగాల్లో వారికి తిరుగులేదనిపించుకున్నారు.

50 తర్వాతి స్థానాల్లో ఎవరంటే..

అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో 50 తర్వాతి స్థానాలు దక్కించుకున్న ప్రముఖుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ 56వ స్థానంలో ఉండగా, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (58వ స్థానం), ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి(61), కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ (62), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ (63), పంజాబ్ సీఎం భగవంత్ మాన్(64), త్రివిధ దళాధిపతి(సీడీఎస్) అనిల్ చౌహాన్ (65), టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(68), గుజరాత్ సీఎం భూపేంద్ర (71), కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (72), రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ(74), యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ (75), ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి(77), ఏఐఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ (78), హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (82), ఇస్రో చైర్మన్ సోమనాథ్ (83), యోగాగురు బాబా రాందేవ్ (86), బాలివుడ్ నటి దీపికా పదుకునే (87), జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ (93), బిగ్ బి అమితాబ్ బచ్చన్ (99) ఉండగా, చివరి స్థానాన్ని వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ వినేశ్ ఫొగట్ (100) దక్కించుకున్నారు.


Advertisement

Next Story