'ఇంకెంత దిగజారిపోతారు'.. సోనియా గాంధీపై బీజేపీ నేత ఫైర్

by Vinod kumar |
ఇంకెంత దిగజారిపోతారు.. సోనియా గాంధీపై బీజేపీ నేత ఫైర్
X

న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని కొంతమంది ప్రతిపక్ష నాయకుల స్టేట్‌మెంట్‌పై ఆమె మౌనాన్ని ‘ఆమోదానికి సూచన’గా పేర్కొన్నారు. సనాతన సంప్రదాయం పట్ల తమ పార్టీ గర్విస్తుందని.. కుల, మతాలకు అతీతంగా అందరికీ సమాన అవకాశాన్ని ఇస్తుందని రవిశంకర్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసిందన్న బీజేపీ నేత.. సోనియా గాంధీ ఇప్పటి వరకు వ్యక్తిగతంగా స్పందించలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌లో అతిపెద్ద నాయకురాలైన సోనియా మౌనం దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోందని తెలిపారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే నేత ఉదయనిధి వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. మరో డీఎంకే నేత ఎ. రాజా ఇదే ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు వ్యాధితో పోల్చి వార్తల్లో నిలిచారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన రవి శంకర్.. ఓట్ల కోసం ఇంకెంత దిగజారిపోతారని విమర్శించారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలని సోనియా గాంధీకి ఎప్పుడైనా అనిపించిందా అని ప్రశ్నించారు. రామజన్మభూమిని ఇంతవరకు ఒక్క కాంగ్రెస్‌ నాయకుడూ సందర్శించలేదని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed