‘హిమాచల్’ సంక్షోభం : కొడుకుకు మద్దతుగా రంగంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్

by Hajipasha |
‘హిమాచల్’ సంక్షోభం : కొడుకుకు మద్దతుగా రంగంలోకి రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటువేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు వేయడంతో హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయ సంక్షోభం సమసిపోయిందని అందరూ భావించారు. కానీ అసలు సంక్షోభం ఇప్పుడే మొదలైంది అనేలా పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. అనర్హత వేటుపడిన ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మద్దతుగా రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ మాట్లాడారు. వారిపై అనర్హత వేటు విధిస్తూ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్‌సింగ్‌ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖును డిమాండ్ చేశారు. ‘‘ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు తమ తప్పును అంగీకరించారు. వారిపై వేటు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పున : పరిశీలించాలి’’ అని కోరారు.

ఒక హోటల్‌లో కీలక భేటీ

అంతటితో ఊరుకోకుండా హిమాచల్ పొరుగు రాష్ట్రం హర్యానాలోని పంచకులలో ఉన్న ఒక హోటల్‌లో ఆరుగురు రెబల్‌ ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య సింగ్ భేటీ అయ్యారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా వీరితో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం కొన్ని గంటల పాటు కొనసాగిందని సమాచారం. రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి తన భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేముందు ఒకసారి ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కావాలని విక్రమాదిత్య సింగ్ భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పై లెక్కల ప్రకారం అసమ్మతి స్వరం వినిపించే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు. వీరంతా ఒకవేళ చేయి కలిపితే విపక్ష ఎమ్మెల్యేల బలం 37కు చేరుతుంది. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ‘34’ కాంగ్రెస్ నుంచి ‘చే’జారే రిస్క్ ఇంకా దరిదాపుల్లోనే కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మా కంటే బీజేపీ బెటర్ : హిమాచల్ కాంగ్రెస్ చీఫ్

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీఫ్, విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభాసింగ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు కూడా రాష్ట్ర రాజకీయాలను మరోసారి వేడెక్కించాయి. ఎమ్మెల్యేలతో ఏకాంత చర్చలు జరిపామని, విభేదాలు సమసిపోయాయని పార్టీ పరిశీలకుడు డీకే శివకుమార్‌ చేసిన ప్రకటనపై ఆమె స్పందించిన తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ‘‘కాంగ్రెస్‌లో చేయాల్సినవి చాలా ఉన్నాయి. పార్టీని పటిష్ఠం చేస్తేనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమని మొదటిరోజు నుంచి నేను సీఎంకు చెబుతున్నాను. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. త్వరలోనే సోనియా, రాహుల్‌లను కలుస్తాం’’ అని ప్రతిభాసింగ్ చెప్పారు. ‘‘మాకంటే బీజేపీ మెరుగైన పనితీరును చూపుతోందన్నది వాస్తవం. ప్రధాని మోడీ సూచనలతో ఆ పార్టీ చురుగ్గా పని చేస్తోంది. కానీ మేం బలహీనంగా ఉన్నాం. ఇది క్లిష్ట సమయం. అయినప్పటికీ మేం ఎన్నికల్లో పోటీ పడాలి. క్రాస్‌ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేల భవితవ్యాన్ని పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed