- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మే 7న మూడో విడత పోల్.. హై ప్రొఫైల్ అభ్యర్థులు ఎవరో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో జరగనుండగా.. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. ఇక మూడో దశ పోలింగ్‌ను మే 7న నిర్వహించనున్నారు. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 95 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్న మొత్తం 1,351 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటరు మహాశయులు ఆ రోజున తేల్చనున్నారు. వాస్తవానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం 94 లోక్‌సభ స్థానాలకే పోలింగ్ జరగాలి. అయితే రెండో విడతలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరగాల్సిన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బీఎస్పీ అభ్యర్థి చనిపోయారు. దీంతో ఆ స్థానాన్ని కూడా మూడోవిడత ఓటింగ్ జరిగే లోక్‌సభ స్థానాల జాబితాలో చేర్చారు.
ముకేశ్ దలాల్ ఏకగ్రీవం..
మూడో విడతలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని మొత్తం 26 స్థానాలకుగానూ 25 చోట్ల పోలింగ్ జరగనుంది. ఈ రాష్ట్రంలోని సూరత్ స్థానానికి మూడో విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా.. అక్కడ ఇప్పటికే ఎన్నిక ఏకగ్రీవమైంది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో లోపం ఉండటంతో ఎన్నికల అధికారులు వాటిని తిరస్కరించారు. అనంతరం బీఎస్పీ అభ్యర్థి సహా మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకొని బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవ ఎన్నికకు లైన్ క్లియర్ చేశారు. దీంతో సూరత్ స్థానానికి పోలింగ్ జరగదు.
ఏయే రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు..
కర్ణాటకలోని 14 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 10 సీట్లు, మహారాష్ట్రలోని 11 సీట్లు, మధ్యప్రదేశ్‌లోని 10 సీట్లు, ఛత్తీస్ గఢ్‌లోని 7 సీట్లు, బిహార్‌లోని 5 సీట్లు, అసోం, బెంగాల్‌లోని చెరో 4 సీట్లు, డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలీలోని 2 సీట్లు, గోవాలోని 2 సీట్లు, కశ్మీర్‌లోని 1 సీటుకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. అత్యధికంగా గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాల నుంచి 658 నామినేషన్లు, మహారాష్ట్రలో 11 స్థానాల నుంచి 519 నామినేషన్లు వచ్చాయి. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 77 నామినేషన్లు, చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ స్థానంలో 68 నామినేషన్లు దాఖలయ్యాయి.
జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. గ్వాలియర్ రాజవంశం చివరి రాజు జీవాజీరావ్ సింధియా మనవడే జ్యోతిరాదిత్య సింధియా. ఆయనతో కాంగ్రెస్ అభ్యర్థి రావ్ యద్వేంద్ర సింగ్ తలపడుతున్నారు.
పల్లవి డెంపో
దక్షిణ గోవా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పల్లవి డెంపో పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విరియాటో ఫెర్నాండెజ్‌ను ఆమె ఎదుర్కొంటున్నారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో గోవా నుంచి పోటీ చేసిన బీజేపీ తొలి మహిళగా డెంపో సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. పల్లవి ఒక విద్యావేత్త.
బీజేపీ రెబల్ కేఎస్ ఈశ్వరప్ప
సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప కర్ణాటకలోని శివమొగ్గ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర, కాంగ్రెస్ నాయకురాలు గీతా శివరాజ్‌కుమార్ బరిలో ఉన్నారు. తన కుమారుడికి లోక్‌సభ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పడంతో.. యడియూరప్ప కుమారుడిపై కేఎస్ ఈశ్వరప్ప రెబల్‌గా బరిలోకి దిగారు. ఈయన పోటీ వల్ల స్థానికంగా బీజేపీ ఓట్లు చీలుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హవేరీ పార్లమెంటు స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత ఆనందస్వామి గడ్డదేవర బరిలో ఉన్నారు.
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కర్ణాటకలోని ధార్వాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయనతో కాంగ్రెస్ నేత వినోద్ అసూటి తలపడుతున్నారు.