Hemanth soren: ఖర్గే, రాహుల్‌తో హేమంత్ సోరెన్ భేటీ.. అసెంబ్లీ ఎన్నికలపై డిస్కషన్ !

by vinod kumar |
Hemanth soren: ఖర్గే, రాహుల్‌తో హేమంత్ సోరెన్ భేటీ.. అసెంబ్లీ ఎన్నికలపై డిస్కషన్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మంగళవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, సీట్ల పంపకంపై చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, జేఎంఎంలు భాగస్వామిగా ఉన్నందున వీలైనంత త్వరగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని సోరెన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ రెండు పార్టీలతో పాటు వామపక్షాలు కూడా జతకట్టే అవకాశం ఉండటంతో సీట్ల పంపంకంపై ఓ కొలిక్కి రావాలని కోరినట్టు తెలిపాయి. కాగా, జేఎంఎం సీనియర్ నేత, మాజీ సీఎం ఇటీవల బీజేపీలో జాయిన్ అయిన నేపథ్యంలో సోరెన్ కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్‌, ఆర్జేడీలు పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. జేఎంఎం 43, కాంగ్రెస్ 31 స్థానాల్లో పోటీ చేయగా, ఏడు నియోజకవర్గాల్లో ఆర్జేడీ బరిలో నిలిచింది. ఆ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మూడు పార్టీలు గతం కంటే ఎక్కువ సీట్లపై కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో రాజకీయ సమీకరణాలు భారీగా మారే చాన్స్ ఉందని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్ 33 సెగ్మెంట్లు ఆశిస్తుండగా, ఆర్జేడీ ఏకంగా 22 నియోజకవర్గాలు కావాలని పట్టుబట్టినట్టు సమాచారం.

ఈ సారి మరిన్ని సీట్లలో పోటీ చేస్తామని ఎందుకంటే గత ఐదేళ్లలో హేమంత్ సొరెన్ హయాంలో పార్టీ బలపడిందని జేఎంఎం సీనియర్ నాయకుడు చెప్పారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ ఇప్పటికే ముగ్గురు సభ్యులతో కూడిన స్క్రీనింగ్ కమిటీని నియమించిందని, ఈ బృందం రాంచీని సందర్శించి గత వారం పరిస్థితిని సమీక్షించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పార్టీ మొత్తం 81 నియోజకవర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించినప్పటికీ 81 స్థానాల్లో 2,500కు పైగా అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed