Hema Committee: మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ నివేదిక

by S Gopi |   ( Updated:2024-08-20 06:00:14.0  )
Hema Committee: మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ నివేదిక
X

దిశ, నేషనల్ బ్యూరో: మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఐదేళ్ల క్రితం 2017లో ఓ నటిపై జరిగిన వేధింపుల సందర్భంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కమిటీకి ఛైర్‌పర్సన్‌గా జస్టిస్ హేమ (మాజీ హైకోర్టు న్యాయమూర్తి), టీ శారద (సినీ ఆర్టిస్ట్), కేబీ వల్సల కుమారి (మాజీ ప్రభుత్వోద్యోగి) ఉన్నారు. చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళలపై జరిగే లైంగిక దోపిడి గురించి వారు నివేదికను రూపొందించారు. ఈ నివేదిక 2019లోనే పూర్తి చేసి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌కు అందించారు. అయితే, దీనిపై ఓ నిర్మాత హైకోర్టులో పిటిషన్ వేయడంతో నివేదిక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 295 పేజీలతో రూపొందించిన ఈ నివేదికను ప్రభుత్వం 63 పేజీలకు కుదించి ప్రచురించింది. చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం చాలా సందర్భాలలో మహిళలు లైంగిక దోపిడీకి గురవడమే కాకుండా కొన్నిసార్లు దాడులకు, మోసాలకు బలవుతున్నారని కమిటీ పేర్కొంది. చాలామంది మహిళలు లైంగిక పరమైన కొరికలు తీర్చకపోతే సినిమాల్లో అవకాశాలు ఇవ్వమని బెదిరింపులకు గురవుతున్నారు. ఇలాంటి కేసుల్లో దర్శకులు, నిర్మాతలు కూడా ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో మద్యం సేవించి మహిళా నటుల ఇళ్లకు వెళ్లి ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎవరైన మహిళలు అవసరాలను తీర్చకపోతే షూటింగ్ సమయాల్లో వారిని ఇబ్బంది పెట్టడం, ఎక్కువ టేకింగ్‌లు తీసుకుని అగౌరవపరచడం లాంటివి చేస్తున్నట్టు కొందరు చెప్పారు. ఎక్కువ శాతం మహిళలు ఇటువంటి వాటి గురించి ఫిర్యాదు చేసేందుకు దూరంగా ఉంటున్నారని, తర్వాత ఏం జరుగుతుందోననే భయాందోళనకు గురవుతున్నారని కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ హేమ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed