వచ్చే ఐదు రోజుల పాటు ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వేడిగాలులు: ఐఎండీ

by S Gopi |
వచ్చే ఐదు రోజుల పాటు ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వేడిగాలులు: ఐఎండీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఒడిశాలలో వేడిగాలులకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అలాగే జమ్మూకశ్మీర్, చండీగఢ్‌లలో రాబోయే ఐదురోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. అయితే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. ఐఎండీ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగవచ్చు. ఈ వాతావరణ పరిస్థితులు వాయువ్య, మధ్య భారత్‌లో ఎక్కువ ప్రభావితం చూపవచ్చని, ముఖ్యంగా మధ్య భారత్‌లో ఈ వేడి ఎక్కువగా ఉండనుందని ఐఎండీ అభిప్రాయపడింది. ఇప్పటికిప్పుడు ఉష్ణోగ్రతల్లో తక్షణ మార్పులు లేకపోయినప్పటికీ క్రమంగా పెరిగే అవకాశం ఉంది. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినవచ్చని, తక్షణ నివారణ చర్యలు అవసరమని ఐఎండీ సూచించింది. ప్రజలు సైతం తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. ముందుజాగ్రత్త కోసం ఎక్కువ నీరు తాగడం, ఎండ ఎక్కువ పడకుండా చూసుకోవడం, ఎక్కువ సమయం చల్లని, నీడ ప్రదేశాల్లో ఉండటం మంచిదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. ఇక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక్, యానాం, గోవా, మరాఠ్వాడా, కొంకర్ ప్రాంతాల్లో రాబోయే కొద్దిరోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed