Heartbreaks: కమలా హ్యారీస్ ఓటమి.. మూగబోయిన తులసేంద్రపురం

by vinod kumar |
Heartbreaks: కమలా హ్యారీస్ ఓటమి.. మూగబోయిన తులసేంద్రపురం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్కంఠగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గెలుపొందగా.. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ (Kamala Harris) ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో కమలా తల్లి స్వగ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురం (Thulasendrapuram) మూగబోయింది. కమలా గెలవాలని పూజలు చేసిన ప్రజలు బుధవారం ఉదయం నుంచి ఫలితాలను ఎంతో అసక్తితో గమనించారు. హ్యారిస్‌ గెలుపును పురస్కరించుకుని వేడుకలు నిర్వహించేందుకు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే కమలా ఓడిపోవడంతో వారంగా ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ‘మేము కమలా విజయం సాధిస్తుందని ఆశించాం. దీపావళి కంటే పెద్ద వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేశాం. బాణాసంచా పేల్చడం, మిఠాయిలు పంపిణీ చేయడం, ఆలయ పూజలు వంటి ఏర్పాట్లు చేశాం’ అని గ్రామ నాయకుడు జే సుధాకర్‌ తెలిపారు. ఆమె పోరాట స్ఫూర్తిని మెచ్చుకోవాలని, కమలా ఒక పోరాట యోధురాలు అని కొనియాడారు. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ తిరిగొస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అదే గ్రామంలోని విశ్రాంత ఉద్యోగి టీఎస్‌ అన్బసరసు మాట్లాడుతూ గ్రామంలోని చాలా మంది కమలా ఓటమిని తట్టుకోలేకపోతున్నారని చెప్పారు. ‘ఆమె ఓడిపోయిందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. కానీ ఆమెకు 60 ఏళ్లు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని ఆశిస్తున్నాం. ఈ ఓటమితో ఆమె కుంగిపోదు. పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుంది’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎన్నికైన తర్వాత తులసేంద్రపురాన్ని సందర్శిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed