‘భోజ్ ‌శాల’ మందిరమా ? మసీదా ? ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు ఆదేశం

by Hajipasha |   ( Updated:2024-03-11 11:49:21.0  )
‘భోజ్ ‌శాల’ మందిరమా ? మసీదా ? ఏఎస్ఐ సర్వేకు హైకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని ధర్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్దపు నిర్మాణం భోజ్ ‌శాలపై ఆరువారాల్లోగా శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని కోరింది. ఈమేరకు హైకోర్టులోని ఇండోర్ బెంచ్ ఏఎస్ఐకు నిర్దేశం జారీ చేసింది. హిందువులు భోజ్‌శాలను సరస్వతీ దేవికి అంకితం చేసిన దేవాలయంగా భావిస్తుంటారని ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ వాదన వినిపించింది. మరోవైపు స్థానిక ముస్లింలు భోజ్ ‌శాలను కమల్ మౌలా మసీదు పేరుతో పిలుస్తుంటారు.

మంగళవారం హిందువులు.. శుక్రవారం ముస్లింలు..

భోజ్‌శాల ఏఎస్ఐ పరిధిలో ఉంది. భోజ్‌శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకునేందుకు.. ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు 2003 ఏప్రిల్‌లో ఏఎస్ఐ అనుమతించింది. ఏఎస్ఐ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2022 మేలో ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్నిహైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై స్పందన కోరుతూ ఏఎస్‌ఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. భోజ్‌శాలకు చెందిన నిజమైన మత స్వభావాన్ని గుర్తించడానికి సర్వేను నిర్వహించాలని కోరింది. భోజ్‌శాలలో ఉన్న స్తంభాలపై సంస్కృత శ్లోకాలు కూడా రాసి ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. వాటి ఫొటోలను ఆధారాలుగా హైకోర్టుకు ‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ సంస్థ సమర్పించింది. భోజ్‌శాల కాంప్లెక్స్‌లో సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌లో కోర్టును కోరారు. 1034 సంవత్సరంలో అప్పటి ధర్ పాలకులు భోజ్‌శాలలో సరస్వతీ విగ్రహాన్ని స్థాపించారని...1857లో బ్రిటీష్ వారు దాన్ని లండన్‌కు తీసుకెళ్లారని వాదన వినిపించారు. వీటన్నింటిని పరిశీలించిన న్యాయస్థానం భోజ్‌శాలపై సర్వే చేయాలని ఏఎస్ఐని తాజాగా సోమవారం ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed