Haryana elections: హర్యానాలో కాంగ్రెస్, ఆప్ పొత్తు.. త్వరలోనే ప్రకటన వెలువడే చాన్స్!

by vinod kumar |
Haryana elections: హర్యానాలో కాంగ్రెస్, ఆప్ పొత్తు.. త్వరలోనే ప్రకటన వెలువడే చాన్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే ఈసీ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించడంతో పాటు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌లు బుధవారం సమావేశం కానున్నట్లు సమాచారం. ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే చాన్స్ ఉన్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశంలో రాహుల్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా నియంత్రించాలంటే పొత్తు అనివార్యమని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

10 సీట్లు డిమాండ్ చేస్తున్న ఆప్ !

హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 10 సీట్లు డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ 5 మాత్రమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. సమాజ్‌వాదీ పార్టీకి ఒక సీటు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్టు తెలిపాయి. పొత్తు కుదిరితే సీట్ల పంపకానికి లోక్‌సభ ఎన్నికల ఫార్ములానే అనుసరించవచ్చని భావిస్తున్నారు. కానీ పొత్తు ఉంటే ఆప్‌కి 3-4 సీట్లు మాత్రమే ఇవ్వగలమని, ఆప్ ఇంతకంటే ఎక్కువ అడుగుతుందని మాజీ సీఎం భూపేందర్ హుడా ఇటీవల వెల్లడించారు. దీంతో సీట్ షేరింగ్ విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 స్థానాల్లో కాంగ్రెస్ 9, ఆప్ 1 సీటులో పోటీ చేశాయి.

పొత్తును స్వాగతిస్తున్నాం: ఆప్

హర్యానాలో కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య పొత్తుకు సంబంధించి కాంగ్రెస్ నేతల నుంచి రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని కోరుతున్నారనే వార్తలను ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్వాగతించారు. బీజేపీ ఓడించడమే తమ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు. పొత్తు విషయమై హర్యానా ఇన్‌చార్జ్ సందీప్ పాఠక్, రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ గుప్తా తుది నిర్ణయం తీసుకుని అరవింద్ కేజ్రీవాల్‌కి తెలియజేస్తారని తెలిపారు. అనంతరం పొత్తు విషయంపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed