Haryana: హర్యానా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు

by S Gopi |
Haryana: హర్యానా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత కంటి శస్త్రచికిత్సలు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రభుత్వ ఆసుపత్రులు, 15 ఎంపిక చేసిన ప్రైవేట్ ఆసుపత్రులలో కంటి శస్త్రచికిత్సలను ఉచితంగా నిర్వహించనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రకటించారు. అంతేకాకుండా చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో విజయవంతమైన టెలిమెడిసిన్ సేవలను ఆదర్శంగా తీసుకుని రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ హాస్పిటల్‌లోని నిపుణుల ద్వారా టెలి-కన్సల్టేషన్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలు రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్య నిపుణుల నుంచి సంప్రదింపులను వీలు కల్పిస్తుంది. ప్రత్యేకించి గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు ఈ సేవలు ప్రయోజనం కల్పిస్తాయని ప్రభుత్వం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే తన ప్రాథమిక లక్ష్యమని నయాబ్ సింగ్ తెలిపారు. ఇదే సమయంలో ఆయుష్మాన్ భారత్ యోజన కింద చికిత్స కోసం రోగి నుంచి నగదు వసూలు చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో కురుక్షేత్రలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌పై వచ్చి ఫిర్యాదు ఆధారంగా ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకున్నారు. ఏదైనా ఆసుపత్రిలో నగదు చెల్లింపులు లేదా రోగులు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి నగదు వసూలు చేసినట్టు గుర్తించినట్లయితే, తక్షణం సదరు ఆసుపత్రి ఎంపానెల్‌మెంట్ రద్దు చేయబడుతుందని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed