Hamas: గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధమే.. హమాస్ కీలక ప్రకటన

by vinod kumar |
Hamas: గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధమే.. హమాస్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ హమాస్ (Israel Hamas) భీకర యుద్ధం తర్వాత ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ కీలక ప్రకటన చేసింది. గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయితే గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా వైదొలగాలని వెల్లడించింది. అలా అయితే పర్మినెంట్‌గా సీజ్ ఫైర్‌ (Ceasefire)కు అంగీకరిస్తామని తెలిపింది. పూర్తిగా ఖైదీల మార్పిడి, బందీల విడుదల చేపడతామని పేర్కొంది. అయితే హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కాగా, ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేస్తుండగా, పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తోంది. ఈ ఒప్పందం మార్చి 1 వరకు అమల్లో ఉండనుంది. అనంతరం రెండో దశపై చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే హమాస్ ప్రకటన వెల్లడించడం గమనార్హం.

ముగ్గురు బందీల రిలీజ్

కాల్పుల విరమణ అగ్రిమెంట్ ప్రకారం హమాస్ మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను శనివారం విడుదల చేసింది. గాజా నగరంలో ఒమర్ వెంకర్ట్, ఒమర్ షెమ్ టోవ్, ఎలియా కోహెన్ అనే ముగ్గురిని రెడ్‌క్రాస్‌ సంస్థకు అప్పగించింది. అనంతరం వారిని ఇజ్రాయెల్ తీసుకెళ్లారు. అంతకుముందు దక్షిణ గాజా నగరమైన రఫాలో తాల్ షోహం, అవెరా మెంగిస్తు అనే మరో ఇద్దరు బందీలను సైతం విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు.

Next Story

Most Viewed