జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలను నిలిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

by S Gopi |
జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో పూజలను నిలిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వివాదానికి సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. జ్ఞాన్‌వాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో పూజలు చేయడంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, హిందువులు చేసే పూజలు మసీదు దక్షిణం వైపు ఉన్న సెల్లార్‌కే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జ్ఞాన్‌వాపి ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ చేయడంపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రెండు వర్గాలు మతపరమైన ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా జ్ఞానవాపి ప్రాంగణంలో యథాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హిందువులు దక్షిణ ద్వారం వైపు సెల్లార్‌లో ప్రార్థనలు చేయాలని, ముస్లిం ఉత్తరం వైపు ప్రార్థన చేసేలా చూడాలని కోర్టు అధికారులకు ఆదేశించింది. మసీదులోని దక్షిణ సెల్లార్‌లో హిందువుల పూజలకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ జులైకు వాయిదా వేసింది. మ‌సీదు సెల్లార్‌లో హిందువులు పూజ‌లు చేసుకోవ‌చ్చ‌ని ఇదివరకు వార‌ణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సైతం ధ్రువీక‌రించిన సంగతి తెలిసిందే. మసీదులో వ్యాస్ టెఖనా వద్ద హిందువులు పూజ చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతించడంతో అంజుమన్ కమిటీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. అక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Advertisement

Next Story