'600 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లిం లేరు'.. కాంగ్రెస్ మాజీ నేత ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Vinod kumar |
600 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లిం లేరు.. కాంగ్రెస్ మాజీ నేత ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

శ్రీనగర్ : కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాంనబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ఇస్లాం కంటే ముందు నుంచే హిందూమతం ఉందని.. హిందూమతమే అతి పురాతనమైనదన్నారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ల పూర్వీకులు ఒకప్పుడు హిందువులేనని కామెంట్ చేశారు. "ముస్లింలలో పది లేదా ఇరవై మంది బయటి నుంచి వచ్చిన వారై ఉండాలి. మిగిలిన వారంతా హిందుత్వం నుంచి ముస్లింలుగా కన్వర్ట్ అయినవారే" అని పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లోని డోదా జిల్లా తాల్హ్రీ ప్రాంతంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

600 సంవత్సరాల క్రితం కశ్మీర్‌లో ఒక్క ముస్లిం కూడా లేరని, ఇక్కడి పండిట్స్‌లో చాలామంది ముస్లింలుగా మారిపోయారని చెప్పారు. కాశ్మీర్‌లో ఉన్న అందరి పూర్వీకులు హిందూమతంలోనే జన్మించారన్నారు. హిందువులైనా, ముస్లింలైనా, రాజ్‌పుట్‌లు అయినా, దళితులైనా, కశ్మీరీలైనా, గుజ్జర్‌లు అయినా.. ఈ దేశమే మన ఇల్లు కాబట్టి ఒక్కటిగా ఉండాలన్నారు. "ఇక్కడికి ఎవరు కూడా బయటి నుంచి రాలేదు. అందరూ ఇక్కడి వారే. మనమంతా ఇదే మట్టిపై పుట్టాం. ఇదే మట్టిపై మరణిస్తాం. మొఘల్ సైన్యంలో భాగంగా ముస్లింలు భారత్ కు వచ్చారు. ఆ తర్వాత మతమార్పిడులు జరిగాయి" అని గులాంనబీ ఆజాద్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed