GRAP-4 : కాలుష్యం తగ్గే వరకు జీఆర్ఏపీ-4 రూల్స్ సడలించొద్దు.. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు

by vinod kumar |
GRAP-4 : కాలుష్యం తగ్గే వరకు జీఆర్ఏపీ-4 రూల్స్ సడలించొద్దు.. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో వాయు కాలుష్యం (Air pollution)పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తగ్గే వరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) నిబంధనలు సడలించొద్దని జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాలుగో దశ గ్రాఫ్‌లో ఆంక్షలు సడలించే ముందు కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది. జీఆర్ఏపీ4 కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికులకు ఏదైనా పరిహారం అందించారా అని ప్రశ్నించింది. ఈ విషయాలను వెల్లడించేందుకు ఢిల్లీ (Delhi), ఉత్తరప్రదేశ్ (Uthara pradesh), రాజస్థాన్ (Rajasthan), హర్యానా(Haryana)ల సీఎస్‌లు గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన జీఆర్ఏపీ4 అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంక్షలను అమలు చేయడానికి, ముఖ్యంగా ఢిల్లీలోకి ట్రక్కు(Trucks)లు ప్రవేశించకుండా నిరోధించడానికి ఎంత మంది అధికారులను నియమించారని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో జీఆర్ఏపీ4 పరిమితులను పాటించలేదనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేవలం రెండు మూడు ఘటనలను బట్టి చూస్తే1.5 కోట్ల జనాభా ఉన్న నగరం మొత్తం నిబంధనలు పాటించడం లేదని చెప్పలేమని ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ (Shadhan Farasath) తెలిపారు. గ్రాప్ నిబంధనలను పాటించడం లేదన్న ఆరోపణలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed