UP's Raebareli: ఉత్తరప్రదేశ్ లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర..!

by Shamantha N |
UPs Raebareli: ఉత్తరప్రదేశ్ లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర..!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రాయ్‌బరేలీలో మరో రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై ఉంచిన సిమెంట్ స్లాబ్‌లను గూడ్స్ రైలు ఢీకొట్టింది. రాయ్‌బరేలిలోని లక్ష్మణ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, రైలు ప్రమాదానికి కుట్ర పన్నినట్లు అధికారులు భావిస్తున్నారు. సమీపంలోని పొలంలో ఉంచిన మూడు సిమెంటు దిమ్మెలను ట్రాక్ పైకి తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే, లోకోపైలట్ అప్రమత్తత వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. దీనిపై, కేసు నమోదు చేశారు. ఆర్పీఎఫ్‌ ఉంచాహర్‌ బృందం దీనిపై దర్యాప్తు చేస్తోంది.

గత నెలరోజులగా..

ఇకపోతే, గత నెల రోజులుగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి రైలు రాకపోకలకు ఆటంకం కలిగించడానికి రైలు పట్టాలపై వస్తువులను ఉంచిన ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లను ఉంచి రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు గత వారం అరెస్టు చేశారు. కాన్పూర్‌లో గ్యాస్ సిలిండర్‌లను ట్రాక్‌లపై ఉంచడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న రైలును పేల్చేసే ప్రయత్నంలో రైల్వే ట్రాక్‌పై డిటోనేటర్లు పెట్టారు. దాదాపు 10 డిటోనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భోపాల్ సమీపంలోని మిస్రోడ్, మండిదీప్ స్టేషన్ల మధ్య గూడ్స్ రైలుకు చెందిన మూడు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో పట్టాలపై సిమెంట్ దిమ్మెలు కనిపించగా, గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో రైల్వే ట్రాక్‌పై విరిగిపోయిన ట్రాక్ లను ఇంచిన ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదాలు తప్పాయి. దీంతో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు రైల్వే ట్రాక్‌లపై ఫుట్‌ పెట్రోలింగ్‌ చేస్తున్నారు. పెట్రోలింగ్‌ను కూడా పెంచినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed