మీ పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి.. నూతన వధూవరులకు ఉదయనిధి స్టాలిన్ పిలుపు

by M.Rajitha |
మీ పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి.. నూతన వధూవరులకు ఉదయనిధి స్టాలిన్ పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాష్ట్ర గీతంలో 'ద్రావిడ'(Dravida) పదాన్ని తొలగించడంపై అధికార డీఎంకే పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin) నూతన వధూవరులకు కీలక పిలుపునిచ్చారు. తమిళనాడుపై హిందీని రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై దూరదర్శన్ కేంద్రం స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా హిందీ మాసోత్సవానికి సంబంధించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి ప్రసంగంలో, ఆలపించిన గీతంలో 'ద్రావిడ' పదం లేకపోవడం వివాదాస్పదమైంది. గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఈ పదాన్ని వదిలేశారని డీఎంకే ఆరోపించింది. కేంద్రం వెంటనే స్పందించి గవర్నర్‌ను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది.

తమిళనాడు హిందీయేతర రాష్ట్రంలో హిందీ మాసోత్సవాలు నిర్వహించడం కేంద్రం హిందీ రుద్దుడు విధానానికి నిదర్శనమని డీఎంకే విమర్శించింది. బహుభాషా దేశంలో ఒకే భాషకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని, బదులుగా ప్రాంతీయ భాషల మాసోత్సవాలు నిర్వహించడం సమంజసమని స్టాలిన్ సూచించారు. అయితే ద్రావిడ పదం తొలగింపు వెనుక గవర్నర్ తప్పిదం లేదని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement

Next Story

Most Viewed