లైంగిక నేరాల కేసులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by Vinod kumar |
లైంగిక నేరాల కేసులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

లక్నో : లైంగిక నేరాల కేసులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు నమోదవుతున్న లైంగిక నేరాల కేసుల్లో అసలైనవి చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడింది. చట్టం అనేది పురుషులకు వ్యతిరేకంగా, మహిళా పక్షపాతంతో కూడుకున్నదిగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం వివేక్ కుమార్ మౌర్య వర్సెస్ స్టేట్ కేసుపై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ ఈ వ్యాఖ్యలు చేశారు. చట్ట పరిరక్షణ ఉండటంతో కొందరు మహిళలు ఆధిపత్యం చలాయిస్తూ.. పురుషులను ట్రాప్ చేయడంలో సులభంగా విజయం సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

"పురుషులతో ఎక్కువ కాలం శారీరక సంబంధాలు పెట్టుకొని.. వారి నుంచి ప్రయోజనం అవసరమైనప్పుడు కొందరు మహిళలు తప్పుడు కేసులు బనాయిస్తున్న ఘటనలే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. చట్టం మహిళా పక్షపాతంతో వ్యవహరిస్తోంది. అలాంటి కేసుల్లో బెయిల్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకునేటప్పుడు కోర్టులు జాగ్రత్తగా వ్యవహరించాలి" అని జడ్జి సూచించారు. "ఎఫ్‌ఐఆర్‌లో నిరాధార ఆరోపణలు చేయడం, ప్రస్తుత (వివేక్ కుమార్ మౌర్య వర్సెస్ స్టేట్) కేసులో లాగా పురుషులను ఇరికించడం చాలా సులభం. సోషల్ మీడియా, సినిమాలు, టీవీ షోల ప్రభావం చిన్నపిల్లలు, బాలికలకు ఓపెన్ కల్చర్‌ను అలవాటు చేస్తున్నాయి. ఇటువంటి ప్రవర్తన భారతీయ కుటుంబ విలువలకు విరుద్ధం. ఇదే పురుషులపై తప్పుడు కేసులు బనాయించే దిశగా కొందరు మహిళలను నడిపిస్తోంది" అని ఆయన అన్నారు.

Advertisement

Next Story