16 కు16 స్థానాల్లో ఓడించినా బీఆర్ఎస్‌కు సిగ్గు రాలేదు: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |   ( Updated:2024-10-19 14:05:54.0  )
16 కు16 స్థానాల్లో ఓడించినా బీఆర్ఎస్‌కు సిగ్గు రాలేదు: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్​నేతలు మూసీకి అడ్డుపడితే నల్గొండ, రంగారెడ్డి ప్రజల నుంచి మరొక ఉద్యమం తప్పదని తెలంగాణ రాష్ట్ర ఆర్​అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మూసీ విషయంలో ఇదే వైఖరి వారు కొనసాగిస్తే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫాంహౌజులను ముట్టడిస్తామని చెప్పారు. నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటి మంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ శుద్ధీకరణను అడ్డుకుంటే ఆనాటి రజాకార్లపై తిరుగుబాటు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమం మళ్లీ పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి మూసీ కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లా ప్రజలను వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే.. గడిచిన పదేండ్లలో నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. నల్గొండ ప్రజల్ని నాయకులు రెచ్చగొడుతున్నారని చెబుతున్న కేటీఆర్ మాటలు పూర్తిగా సత్యదూరమని చెప్పిన ఆయన.. నల్గొండ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయేంత అమాయకులు కాదని... స్వతహాగా పౌరుషం ఉన్న వ్యక్తులమని ఆయన అన్నారు.

నల్గొండ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని.. ఇలాగే మూసీ కి అడ్డం పడితే మీ ఇండ్ల ముందు శాంతియుతంగా లక్షల మంది నల్గొండ బిడ్డలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మూసీకి అడ్డుపడే ప్రతి రాజకీయ పార్టీని నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు. మూసీ కాలుష్యం తో ప్రజలు క్యాన్సర్, నరాల జబ్బులు, గుండె, కిడ్నీ లు పాడైపోవడం, పిల్లల్లో పెరుగుదల లోపించడం, కంటి సమస్యలు, చర్మ వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారని... ఇంకా వాళ్ళు అలాగే చచ్చిపోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ మోసాలకు ఇప్పటికే నల్గొండ నరకయాతన పడుతున్నదని.. ఇప్పుడు ఆయన కొడుకు మోపయ్యిండని ఆక్షేపించారు. ఎవ్వరు అడ్డువచ్చిన మూసీ విషయంలో వెనకడుగు వేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. మూసీ డీపీఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను కట్టిందని ఎక్కడో పాకిస్థాన్ లో కేసు అయ్యిందని… మూసీపై అవినీతి బురద జల్లడం దారుణమని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం డీపీఆర్ ను తయారు చేసిన వ్యాప్కోసును ఒరిస్సా గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది.

గుజరాత్ లో నిషేధించిందని చెప్పిన మంత్రి.. కేటీఆర్ బంధువుల సంస్థ గ్లోబరిన పదుల సంఖ్యలో విద్యార్ధుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని కేటీఆర్ ప్రజలకు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చెప్పలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం డీపీఆర్‌కు 2015 లోనే 33 కోట్లు చెల్లించారని.. ఇప్పుడు రూ. 140 కోట్లు చెల్లిస్తుంటే గగ్గోలు పెడుతున్నరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడటం వచ్చని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాలనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని.. కేసీఆర్ కుటుంబ మోసాల్ని ప్రజలు పసిగట్టిన్రు కనుకనే 16 కు 16 స్థానాల్లో గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు మూసీ డీపీఆర్ పూర్తికాకముందే ఎందుకు లక్షల కోట్లని ఎగిరెగిరి పడుతున్నరని ప్రశ్నించిన ఆయన.. కేటీఆర్, హరీష్ రావు అమెరికాకు పోయి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డు పడుతున్నారో ముందు చెప్పాలని సవాల్ చేశారు. మిషన్ భగీరథ లో 5 వేల కోట్ల రూపాయలను దోచుకున్న కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల ఇప్పటికే అనేక గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లే తాగుతున్నారని ఆయన ఆరోపించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మార్చుకున్న వాళ్లకు ప్రతీది ఏటీఎంలలాగే కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. ఆ దోపిడీ యావ నుంచి బయటకు రాలేకనే అన్నిట్లో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 2 వేల కోట్లు పెట్టి 9 కిలోమీటర్ల ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పని పూర్తి చేస్తే ఇవ్వాల నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు బంగారు మాగాణంగా మారేవని, ఫ్లోరైడ్ ఇబ్బందులు తప్పేవని… కేవలం నాకు పేరొస్తుందనే ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పదేండ్లు పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పూర్తయితే శ్రీశైలంలో డెడ్ స్టోరేజీ ఉన్నా నల్గొండకు నీటి కొరత ఉండేది కాదని ఆయన అన్నారు. అంతేకాదు, పులిచింతలకు నీళ్లను సీమాంధ్రకు తరలిస్తుంటే అక్కడి మోటర్లను తగులబెట్టానని.. ఆ విషయం అందరికి తెలుసన్న మంత్రి.. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం మంజూరీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తెల్చి చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆనాడు పోరాడి ప్రాజెక్టును మంజూరు చేయించి 80 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం 11 కిలోమీటర్ల పనుల పూర్తి చేసేందుకు పదేండ్లు సరిపోక పోవడం అంటే.. నల్గొండపై వారికున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమని ఆరోపించారు.

బ్రాహ్మణవెల్లంల, శివన్న గూడెం, పూర్తిచేస్తే మరింతగా రైతులకు ఉపయోగం అవుతుందన్న మంత్రి నల్గొండలో బోర్ వేస్తే నీరు పసుపు రంగులో వస్తున్న విషయం ప్రపంచమంతా తెలుసు అని చెప్పారు. ఆగష్టులో కేంద్ర పర్యావరణ సంస్థ మూసీలో ప్రమాదకరస్థాయిలో హెవీ మెటల్స్ ఉన్నాయని చెప్పిన సంగతి కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేం మంత్రులం అందరం కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మూసీ కి పరిష్కారం చూపెట్టాలని కోరామని తెలిపిన మంత్రి.. కోటి మంది తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేసేందుకే మూసీ శుద్ధీకరణను తీసుకున్నామని ఆయన వివరించారు. కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూసీలో ఫ్లోరిన్ తో పాటు, ఇతర హెవీ మెటల్స్ పెరిగాయని కేంద్ర ప్రభుత్వ సంస్థలు తేల్చిన విషయం కేటీఆర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్టీపీల ద్వారా రెండు మూడు దశల్లో ట్రీట్మెంట్ చేసినప్పటికి వందశాతం హెవీ మెటల్స్ ను తీసివేయలేమని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చెప్తుంటే ఎస్టీపీ ద్వారా నల్గొండకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

కేటీఆర్ కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే దేశ ప్రధానికి జూమ్లా పీఎం – రాష్ట్ర ముఖ్యమంత్రిని హౌలా సీఎం అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మీకు డబ్బుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వధినేతలు కనిపించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అధికారం పోవడంతో మానసికంగా ఇబ్బందులు పడ్డట్టు కనిపిస్తుందని.. డాక్టర్ కు చూపించుకోవాలని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. కేసీఆర్ కొడుకు కాకుంటే కేటీఆర్ ను ఎవరు గుర్తు కూడా పట్టరని.. అట్లాంటిది కష్టపడి పైకొచ్చిన మా ముఖ్యమంత్రిపై, మాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రెజువేనేషన్ స్పెల్లింగ్ రాదని.. కండ్లు నెత్తికెక్కి మాట్లాడిన కేటీఆర్ మాటలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. మేం జేడ్పీ స్కూళ్లో చదివినప్పటికీ మేం సంస్కారవంతంగా మాట్లాడతామని చెప్పిన మంత్రి.. అమెరికాకు పోయి చదువుకొని కోట్ల మంది ప్రజల ప్రాణాలను బలితీసుకోవాలని చూడటం బాధాకరమని ఆయన అన్నారు.

ఆయన ఏదో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినట్లు చెప్తారని.. కానీ ఆయన చేసిన అద్భుతం మురికి కూపం దుర్గం చెరువు మీద తీగల బ్రిడ్జ్, టీహబ్ బిల్డింగ్ తప్పా కేటీఆర్ చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ప్రపంచ మేధావి కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి మూసీ వల్ల మూడు జిల్లాల ప్రజలు పడుతున్న సమస్యలపై మాట్లాడాలని మంత్రి సూచించారు. నల్గొండలో పుట్టిన చిట్టి నాయుడు(మాజీ మంత్రిని ఉద్దేశించి) ఒకరు మొన్నటి ఎన్నికల్లో 3 వేల ఓట్లతో గెలిచినప్పటికి ఆయనకు నల్గొండ సమస్యలు పట్టవని అన్నారు.. బస్సు కిరాయిలు లేనోడికి ఇప్పుడు 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని.. ఉప్పల్‌లో వాటర్ ప్లాంట్ పెట్టి నడిపిన వ్యక్తి.. కేసీఆర్ కు ఉన్నంత ఫామ్ హౌజ్ ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకొని పది వేల కోట్లు దోచుకున్న ఆ చిట్టి నాయుడు.. ఎప్పుడు నల్గొండ బిడ్డల బాగుకోసం పని చేయలేదని ఆరోపించారు.. మొన్నటి ఎన్నికల్లో మా అభ్యర్ధి దామోదర్ రెడ్డి కి మోకాలి ఆపరేషన్ కావడంతో చిట్టి నాయుడు బతికి బయటపడ్డాడని లేదంటే యాభై వేల మెజార్టీతో ఇంటికి పంపే వాళ్లమని తేల్చిచెప్పారు.

Advertisement

Next Story

Most Viewed