Gaza hostages: గాజాలో ఆరుగురు బందీల మృతదేహాలు.. స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్

by vinod kumar |   ( Updated:2024-09-01 06:38:48.0  )
Gaza hostages: గాజాలో ఆరుగురు బందీల మృతదేహాలు.. స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ చెరలో ఉన్న మరో ఆరుగురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్ సైన్యం తాజాగా స్వాధీనం చేసుకుంది. దక్షిణ గాజా నగరమైన రఫా ప్రాంతంలోని ఓ సొరంగం వద్ద వీరిని గుర్తించింది. బందీలుగా ఉన్న వారిని సైనికులు రక్షించేందుకు ఆపరేషన్ నిర్వహిస్తుండగానే వారిని హమాస్ దారుణంగా హత్య చేసిందని పేర్కొంది. మరణించిన వారిని హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ (23), ఓరి డానినో (25), ఈడెన్ యెరుషల్మీ (24), అల్మోగ్ సరుసి (27), అలెగ్జాండర్ లోబనోవ్ (33), కార్మెల్ గాట్(40)గా గుర్తించారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన సమయంలోనే వీరిని హమాస్ బంధించినట్టు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలపై హమాస్ స్పందించలేదు. మృతి చెందిన వారిలో ఉన్న హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ అమెరికా-ఇజ్రాయెల్ పౌరుడు కావడం గమనార్హం.

బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా బందీల కుటుంబ సభ్యులు నిరసనలకు పిలుపునిచ్చారు. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందంతో వారిని తిరిగి సజీవంగా తీసుకురావడంలో నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపించారు. కాల్పుల విరమణ ఆపి బందీల విడుదలకు చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కాగా, అక్టోబరు 7న దాదాపు 250 మందిని బందీలుగా చేసుకున్నారు. వారిలో మూడింట ఒక వంతు మంది చనిపోయారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలో ఇంకా 108 మంది బందీలుగా ఉన్నారని పేర్కొంది. ఆగస్టు చివరి వారంలోనూ ఆరుగురు బందీల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది.

హమాస్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: బైడెన్

ఇజ్రాయెల్ అమెరికన్ పౌరుడు మరణించడంపై యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పౌరుడి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ నేరాలకు హమాస్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మిగిలిన బందీలను విడుదల చేయడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యుద్ధం ముగిసే సమయం వచ్చిందని, దీనిని త్వరలోనే ముగించాలని వెల్లడించారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ సైతం స్పందించారు. హెర్ష్ గోల్డ్‌బెర్గ్-పోలిన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story