Gangsters Act : యూపీ గ్యాంగ్‌స్టర్స్ చట్టం క్రూరత్వాన్ని తలపిస్తోంది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by vinod kumar |
Gangsters Act : యూపీ గ్యాంగ్‌స్టర్స్ చట్టం క్రూరత్వాన్ని తలపిస్తోంది.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ (నివారణ) చట్టం చాలా క్రూరంగా కనిపిస్తోందని సుప్రీంకోర్టు (Supreme court) వ్యాఖ్యానించింది. ఈ చట్టంపై పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. గ్యాంగ్ స్టర్స్ చట్టం కింద పెండింగ్‌లో ఉన్న విచారణలను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గతేడాది మేలో అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా జస్టిస్ బీఆర్ గవాయ్ (BR gaway), జస్టిస్ కేవీ విశ్వనాథన్‌( Kv vishwanath)లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీ గ్యాంగ్‌స్టర్ చట్టంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా క్రూరమైనదిగా కనిపిస్తోందని తెలిపింది. దానిని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన మరో పిటిషన్‌ను కూడా కోర్టు విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

అంతకుముందు నవంబర్ 29న చట్టంలోని కొన్ని నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ వేసిన ప్రత్యేక పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దీనిపై ప్రతిస్పందన కోరుతూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, యూపీ గ్యాంగ్‌స్టర్ చట్టం పోలీసులకు విస్తృత అధికారాలను మంజూరు చేస్తుంది. వారు ఫిర్యాదుదారుగా, ప్రాసిక్యూటర్‌గా, న్యాయనిర్ణేతగా వ్యవహరించడానికి వీలు కల్పిస్తుంది, అంతేగాక ముందస్తు అనుమతి లేకుండా నిందితుడి మొత్తం ఆస్తులను అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story