Gangster: పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు.. ఒకరు మృతి

by vinod kumar |
Gangster: పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య కాల్పులు.. ఒకరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్‌ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో పోలీసులు ఒక గ్యాంగ్‌స్టర్‌ను హతం చేయగా.. ఆయన సహచరుడైన మరొక గ్యాంగ్‌స్టర్ తప్పించుకున్నాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ హత్య కేసు విచారణలో భాగంగా గ్యాంగ్‌స్టర్లు గుర్శరన్, పరాస్, మరొక వ్యక్తిని బుధవారం ఉదయం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు గతంలో పొదల్లో దాచిపెట్టిన తుపాకులను తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు సైతం ఆత్మరక్షణ కోసం గ్యాంగ్ స్టర్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక గ్యాంగ్‌స్టర్ గుర్శరన్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోగా.. పరాస్ కాల్పులు జరుపుతూ నదిలోకి దూకి తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు ఘటనా స్థలం నుంచి గ్లాక్ పిస్టల్, కొన్ని లైవ్ కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులిద్దరూ లఖ్‌బీర్ సింగ్ అలియాస్ లండా హరికే గ్యాంగ్‌కు చెందినవారిగా తెలిపారు.

Advertisement

Next Story