Ganesh Hake : ఎన్సీపీతో పొత్తు కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం.. బీజేపీ నేత గణేష్ హకే

by vinod kumar |
Ganesh Hake : ఎన్సీపీతో పొత్తు కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం.. బీజేపీ నేత గణేష్ హకే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార మహాయుతి కూటమిలో విబేధాలు బయటపడుతున్నాయి. కూటమిలోని ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంపై బీజేపీ, శివసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ నేతలతో కూర్చోవడం వికారంగా ఉందని షిండే శివసేన నేత తానాజీ ఇటీవల వ్యాఖ్యానించగా దీనిని ఎన్సీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో పొత్తును కొనసాగిస్తే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ అధికార ప్రతినిధి గణేష్ హకే అన్నారు. ఎన్సీపీకి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టమని, కానీ మాకు అది ఇష్టం లేదని తెలిపారు. ఎన్సీపీ కాషాయ పార్టీ పొత్తు పెట్టుకోవడం దురదృష్టకరమని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థుల కోసం ఎన్సీపీ పని చేయలేదని ఆరోపించారు. లాతూర్‌లో బీజేపీ అభ్యర్థి కోసం ఎన్సీపీ పనిచేయలేదని, తమ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని తెలిపారు.

అంతకుముందు శివసేన మంత్రి తానాజీ సావంత్ మాట్లాడుతూ.. ‘నేను అత్యంత కఠినమైన శివసైనికుడిని, విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్, ఎన్సీపీతో ఎప్పుడూ కలిసిపోలేదు. కానీ కేబినెట్‌లో ఎన్సీపీ పక్కన కూర్చున్నా. అనంతరం బయటకు వచ్చేటప్పుడు వికారంగా అనిపించింది’ అని వ్యాఖ్యానించారు. దీంతో త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ వీరిద్దరి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలతో మహాయుతి కూటమిలో ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయని పలువురు భావిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన, ఎన్సీపీ పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి.

Advertisement

Next Story