గాంధీలు దమ్ముంటే చర్చకు రావాలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్

by Dishanational2 |
గాంధీలు దమ్ముంటే చర్చకు రావాలి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశానికి సంబంధించిన ప్రధాన సమస్యలపై ప్రధాని మోడీ ఏనాడూ మాట్లాడలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఘాటుగా స్పందించారు. ఏ విషయం మీదైనా మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, గాంధీలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎటువంటి సమస్య మీద మాట్లాడాలో వారే ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. చానల్, యాంకర్, స్థలం కూడా ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీలే ఎంచుకోవాలని చెప్పారు. మా పార్టీ నుంచి సరైన సమాధానం చెప్పడానికి సుధాన్షు త్రివేది చాలని వెల్లడించారు. ఎన్నికల టైంలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు.

కాగా, అంతకుముందు ప్రియాంకా గాంధీ ప్రసంగిస్తూ..నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల కష్టాలపై మోడీ మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే స్మృతీ ఇరానీ స్పందించి పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే స్పందించారు. నాతో చర్చకు రావాలని తెలిపారు. ‘స్మతీ ఇరానీ నాతో చర్చకు రావాలని కోరుతున్నా. స్థలం మీదే, రోజు మీదే, యాంకర్ మీవారే, సమస్య కూడా మీదే. నీకు ధైర్యం ఉందా? కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో మాట్లాడే స్థాయి నీకు లేదు. ఉనికి కోసం పోరాడటం మానేసి.. సవాల్‌ను స్వీకరించండి’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

Next Story

Most Viewed