Yoav Gallant: ఇజ్రాయెల్ భద్రతే ముఖ్యం.. అదే నా జీవిత లక్ష్యం

by Shamantha N |
Yoav Gallant: ఇజ్రాయెల్ భద్రతే ముఖ్యం.. అదే నా జీవిత లక్ష్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గాజాలో హమాస్‌తో, లెబనాన్‌లో హెజ్‌బొల్లాపై టెల్ అవీవ్ దాడులు కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గాలంట్‌ (Yoav Gallant)ను తొలగిస్తున్నట్లు ప్రధాని నెతన్యాహు (Netanyahu) ప్రకటించారు. కాగా.. తన తొలగింపుపై గాలంట్‌ స్పందించారు. ‘ఇజ్రాయెల్‌ భద్రతే ముఖ్యం. అదే, నా జీవిత లక్ష్యం. దాదాపు 50 ఏళ్లు ప్రజాసేవలో స్థిరంగా, స్పష్టంగా ఉన్నాను. ఐడీఎఫ్‌, భద్రతా స్థాపన తర్వాతే నా వ్యక్తిగత భవిష్యత్తు అని నేను భావించాను’ అని గాలెంట్‌ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల విమర్శలు

రక్షణ మంత్రి గాలెంట్ ని బాధ్యతల నుంచి తొలగిస్తూ నెతన్యాహు చేసిన ప్రకటనను ప్రతిపక్ష నాయకుడు బెన్నీ గాట్జ్‌ ఖండించారు. ‘ఇది జాతీయ భద్రతను పణంగాపెట్టే రాజకీయం’ అని పేర్కొన్నారు. మరోవైపు, నెతన్యాహు తీసుకున్న నిర్ణయం గాజాలోని బందీలపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. గాలంట్‌ను తొలగిస్తూ నెతన్యాహు తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి టెల్‌అవీవ్‌లోని ప్రధాన వీధుల్లో భారీగా నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్‌ జెండాలతో నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలాఉండగా.. గత ఏడాది గాలంట్‌ను తొలగించేందుకు యత్నించగా.. దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. దీంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈక్రమంలోనే నెతన్యాహు ఈ నిర్ణయం తీసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed