స్మార్ట్ ఫోన్ల కాలంలోనూ సొంత డ‌బ్బుల‌తో పోస్టాఫీస్ క‌ట్టుకున్న గ్రామ‌స్థులు! ఎందుక‌లా..?!

by Sumithra |
స్మార్ట్ ఫోన్ల కాలంలోనూ సొంత డ‌బ్బుల‌తో పోస్టాఫీస్ క‌ట్టుకున్న గ్రామ‌స్థులు! ఎందుక‌లా..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఇంటర్నెట్, మొబైల్ ఫోన్‌లు వేగంగా వ్యాప్తి చెందుతున్న డిజిటల్ ప్రపంచంలో, పోస్టాఫీసులు పాతబడ్డాయి. ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న‌ గాగువా గ్రామస్థులకు మాత్రం పోస్టాఫీసే ముఖ్యం. ఎంత పాతదైన‌ప్ప‌టికీ తపాలా వ్యవస్థపై వారికి ఉన్న బ‌ల‌మైన‌ విశ్వాసమే దీనికి కార‌ణం. అందుకే, కూలిపోయే దశలో ఉన్న‌ పాత మట్టిగోడల గుడిసెలో ఉన్న పోస్టాఫీస్ స్థానంలో కొత్తగా ప‌క్కా భవనం నిర్మించి, మార్చి 16న ఆవిష్కరించారు. పోస్టాఫీస్ భ‌వ‌న నిర్మాణం కోసం గ్రామ‌స్థులంతా డ‌బ్బులు కూడ‌దీసుకున్నారు. విరాళాల కోసం స్థానిక ప్రజలను చైతన్యపరచి, ఏకంగా 2 లక్షల రూపాయలను సేక‌రించారు.

ఈ గ్రామంలో ఉన్న పోస్టాఫీస్‌కు చాలా చ‌రిత్ర ఉంది. ఇక్క‌డ 1927వ సంవ‌త్స‌రంలో పోస్టాఫీసు స్థాపించ‌బ‌డింది. అప్ప‌టి నుంచి గత తొమ్మిది దశాబ్దాలకు పైగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు ఇది సేవలందిస్తోంది. భజన సామ్రాట్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు భికారి బాల్ జన్మస్థలంగా గాగువా గ్రామం ప్రసిద్ధి చెందింది. భికారి బాల్ ఇదే పోస్టాఫీసుకు నిత్యం వచ్చేవాడని గ్రామస్తులు చెబుతారు. ఇక‌, గ్రామ చ‌రిత్ర‌లో మ‌కుటంగా నిలిచిన ఈ పోస్టాఫీసుకు సరైన భవనం నిర్మించేందుకు డబ్బులు మంజూరు చేయాలని అనేకసార్లు పోస్టల్ అధికారులకు విన్నవించినా ఫలితం లేక‌పోవ‌డంతో తామే సమస్యను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే, సొంత‌గా వనరులు స‌మ‌కూర్చుకొని, కేవలం మూడు నెలల వ్యవధిలో ప‌క్కా భవనాన్ని నిర్మించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా, ఇక్క‌డ మాజీ పోస్ట్‌మాస్టర్‌గా ప‌నిచేసిన‌ హరీష్ చంద్ర సమాల్ మాట్లాడుతూ, కొరియర్ సేవలు నగరాలకే పరిమితం కావడంతో, గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికీ మనీ ఆర్డర్‌ల ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడంతో పాటు ఉత్త‌రాలు కూడా రాస్తున్నార‌ని అన్నారు. గ్రామస్థుల సంక‌ల్పంతో చేప‌ట్టిన ఈ చర్య జిల్లా యంత్రాంగానికి, రాజకీయ నాయకులకు కళ్లు తెరిపించాలని అన్నారు.

Advertisement

Next Story