ఐఎస్ఎస్ కు భారత్ నుంచి వెళ్లనున్న తొలి వ్యోమగామి

by Shamantha N |
ఐఎస్ఎస్ కు భారత్ నుంచి వెళ్లనున్న తొలి వ్యోమగామి
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ నుంచి వ్యోమగామి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్ యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణిస్తుందని తెలిపారు. ఇది ఇస్రో, నాసా, యాక్సియమ్ స్పేస్ అనే ప్రైవేట్ కంపెనీల మధ్య ఉమ్మడి మిషన్ అని పేర్కొన్నారు. ఈమిషన్ కోసం నలుగురు వ్యోమగాములు రష్యాలో స్పేస్ ఫ్లైట్ బేసిక్ మాడ్యూల్‌పై శిక్షణ పొందారని తెలిపారు. ప్రస్తుతం, వ్యోమగాములు గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో యొక్క ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ATF)లో శిక్షణ పొందుతున్నారని చెప్పారు. మూడు సెమిస్టర్లలో జరిగే గగన్‌యాన్ శిక్షణా కార్యక్రమంలో ఇప్పటికే రెండు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ కోసం అవసరమైన సిమ్యులేటర్‌లు, స్టాటిక్ మోకప్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌లోని కొన్ని భాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.

2024 ఆగస్టులో మిషన్

నాసా, యాక్సియమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాలుగవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో అధికారి తెలిపారు. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్ట్ 2024లోపు ప్రయోగించే అవకాశం ఉంది. దీని కోసం ఇస్రో బోర్డు ఈ నలుగురు పైలట్లను ఎంపిక చేసింది. వీరే రష్యాలో శిక్షణ తీసుకున్నారు.



Next Story

Most Viewed