వీడిన సిక్కిం మాజీ మంత్రి మిస్సింగ్ మిస్టరీ.. బెంగాల్ లో మృతదేహం లభ్యం

by Shamantha N |
వీడిన సిక్కిం మాజీ మంత్రి మిస్సింగ్ మిస్టరీ.. బెంగాల్ లో మృతదేహం లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: సిక్కిం మాజీ మంత్రి ఆర్సీ పౌడ్యాల్ మిస్సింగ్ మిస్టరీ వీడింది. అదృశ్యమైన తొమ్మిది రోజుల తర్వాత.. పశ్చిమ బెంగాల్ లో ఆయన మృతదేహం లభ్యమైంది. బెంగాల్‌లోని సిలిగురి సమీపంలోని కాల్వలో మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. 80 ఏళ్ల పౌడ్యాల్ మృతదేహం ఫుల్బరీ దగ్గర తీస్తా కెనాల్‌లో మంగళవారం లభ్యమైందని పేర్కొన్నారు. తీస్తా నదికి ఎగువ నుంచి మృతదేహం కొట్టుకువచ్చిందని అనుమానాసిస్తున్నామని అన్నారు. వాచ్, దుస్తుల ద్వారా బాధితుడిని గుర్తించామన్నారు. సిక్కింలో పాక్యోంగ్ జిల్లాలోని ఛోటా సింగ్టామ్ పౌడ్యాల్ స్వస్థలం. జులై 7న ఆయన నివాసం నుంచి పౌడ్యాల్ అదృశ్యమయ్యారు. అప్పట్నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సిక్కిం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన "మరణంపై దర్యాప్తు కొనసాగుతుంది" అని అధికారులు వెల్లడించారు.

సిక్కిం తొలి డిప్యూటీ స్పీకర్ గా..

ఇకపోతే పౌడ్యాల్ సిక్కిం అసెంబ్లీలో తొలి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ఆతర్వాత సిక్కిం రాష్ట్ర అటవీశాఖ మంత్రి అయ్యారు. 1970ల్లో రైజింగ్ సన్ పార్టీని స్థాపించి సిక్కిం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సిక్కిం సాంస్కృతిక, సామాజిక స్థితిగతులపై పౌడ్యాల్ కు అపార అనుభవం ఉంది. ఇకపోతే, పౌడ్యాల్ మృతిపై సిక్కిం ముఖ్యమంత్రి పీఎస్ తమాంగ్ సంతాపం వ్యక్తం చేశారు. వివిధ హోదాల్లో సిక్కిం ప్రభుత్వానికి సేవలందించిన రాజనీతిజ్ఞుడు, విశిష్ట నాయకుడి ఆకస్మిత మరణం తీరని లోటన్నారు.

Advertisement

Next Story