ఇతరులను విమర్శించడమే మోడీ పని: శరద్ పవార్

by S Gopi |
ఇతరులను విమర్శించడమే మోడీ పని: శరద్ పవార్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ విమర్శలతో విరుచుకుపడ్డారు. భారత మాజీ ప్రధానులు దేశాభివృద్ధి కోసం పనిచేశారని, కానీ ప్రధాని మోడీ మాత్రం ఇతరులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. అంతేకాకుండా గడిచిన పదేళ్ల నుంచి తన ప్రభుత్వం ప్రజలకు చేసిన దాని గురించి మాట్లాడ్డంలేదని ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అమరావతిలో జరిగిన ప్రచార సభలో పవార్ ప్రసంగిస్తూ.. దేశానికి మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన కృషిని ప్రశ్నించలేమని అన్నారు. నెహ్రూతో పాటు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ నవ భారతం కోసం కృషి చేశారు. నెహ్రూ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది. దాన్నెవరూ మర్చిపోలేరు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రధాని మాత్రమే ఇతరులను విమర్శిస్తూ, ప్రదేళ్లలో చేసినదేంటో చెప్పడంలేదని అన్నారు. ఇదే సమయంలో కొంతమంది బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చడం గురించి బహిరంగంగా మాట్లాడారని, ప్రధాని మోడీ సైతం ప్రజల్లో భయం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరహాలో ప్రవర్తిస్తున్నారు. భారత్‌లో మరో పుతిన్ తయారవుతున్నారు. ఇది ఆందోళన చెందాల్సిన విషయం. దేశంలో నిరంకుశ పాలనను అనుమతించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని పవార్ ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story