మోడీ మౌనం వీడాలి.. నిజం ఏంటో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్!

by GSrikanth |
మోడీ మౌనం వీడాలి.. నిజం ఏంటో ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఓ ఇంటర్వూలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పుల్వామా ఘటనపై స్పందించిన సత్యపాల్ మాలిక్.. నాటి ఘటనలో నిర్లక్ష్యం ఉందని.. సైనికులను తరలించేందుకు విమామాలు సిద్ధం చేయాలని కోరితే అందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరాకరించిందని చెప్పారు. దాంతో బలగాలు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుండగా ఉగ్రవాదుల దాడి జరిగిందని ఈ దాడి అనంతరం ప్రధాని తనకు ఫోన్ చేయగా భద్రతా లోపాలను తాను ఎత్తి చూపానన్నారు. అయితే ఈ ఘటనపై ఏమీ మాట్లాడవద్దని ప్రధాని తనతో చెప్పారని, అలాగే జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ సైతం మౌనంగా ఉండాలని చెప్పినట్లు సత్యపాల్ మాలిక్ వెల్లడించారు.

ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మాలిక్ వ్యాఖ్యలపై ప్రధాని మౌనం వీడి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. సత్యపాల్ మాట్లాడిన ఒకరోజు తర్వాత కాంగ్రెస్ నేత జైరాం రమేష్, పవన్ ఖేరా, సుప్రియా షిర్నాటే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వాం 'మినిమం గవర్నెన్స్, మ్యాగ్జిమం సైలెన్స్' అనే విధానంతో పని చేస్తోందని ఎద్దేవా చేశారు. సైనికుల ప్రాణాలు పోయినా మోడీ మాత్రం పాపులారిటీ కోసమే ప్రయత్నించాడని విమర్శలు గుప్పించారు. పుల్వామా ఉగ్రదాడి తీవ్రమైన జాతీయ భద్రతకు సంబంధించిన అంశం అని అందువల్ల ఈ అంశం చుట్టూ ఉన్న గందరగోళాన్ని వీలైనంత త్వరగా తొలగిపోయేలా ప్రధాని స్పందించాలని కోరారు. కాగా గతంలోనే ఈ అంశంపై కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగా తాజాగా సత్యపాల్ వ్యాఖ్యలతో మోడీపై విరుచుకుపడేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాదిలో ఈ అంశం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుందా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఒక వేళ పుల్వామా ఘటన మళ్లీ తెరపైకి వస్తే అది ఎవరికి నష్టం మరెవరికి లాభం అనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed