అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి.. కేంద్రానికి ఆర్మీ సూచనలు

by Shamantha N |
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి.. కేంద్రానికి ఆర్మీ సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్నిపథ్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో కేంద్రానికి ఆర్మీ అధికారులు పలు సూచనలు చేయనున్నారు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచాలని కోరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అగ్నిపథ్ అభ్యర్థులకు 21 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి ఉండగా.. దాన్ని 23 ఏళ్లకు పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నారు. అయితే, వయోపరిమితి పెంచితే సాయుధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశాలు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అగ్నిపథ్ ద్వారా చేరిన వారిలో కేవలం 25 శాతం మంది సర్వీస్ కొనసాగిస్తున్నారు. కాగా.. నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మందిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఇదే జరిగితే కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో మ్యాన్ పవర్‌ కొరత తగ్గించవచ్చని ఆర్మీ అధికారులు అభిప్రాయపడ్డారు. సైన్యం మరింత శక్తిమంతంగా ఉండాలంటే ఈ మార్పులు అవసరమని అన్నారు. మరోవైపు, అగ్నిపథ్‌ పథకం కింద త్రివిధ దళాల్లో పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల వయసు గల అభ్యర్థుల నియామకం జరుగుతోంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తి అయిన తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తున్నారు. రెగ్యులర్ అయిన వారికి మరో 15 ఏళ్ల పాటు సర్వీస్ పొడిగించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed