ఆరోజున 'సర్వమత ర్యాలీ'కి దీదీ పిలుపు

by S Gopi |
ఆరోజున సర్వమత ర్యాలీకి దీదీ పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్ఠించే రోజు కాళీఘాట్ ఆలయాన్ని సందర్శిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కాళీ మందిర్‌లో పూజలు నిర్వహించిన అనంతరం, అక్కడి నుంచి భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు ఆమె పేర్కొన్నారు. హజ్రా నుంచి పార్క్ సర్కస్ మైదానం వరకు 'సర్వమత ర్యాలీ' ఉంటుందని, ఆలయాలు, చర్చిలు, గురుద్వారాలను కలుపుతూ ర్యాలీ తీయనున్నట్టు దీదీ స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాన్ని రాజకీయ జిమ్మిక్‌గా అభివర్ణించిన మమతా, 'అందరినీ ఒకచోట చేర్చి, అందరి గురించి మాట్లాడే పండుగను నేను నమ్ముతాను. ప్రస్తుతం జరుగుతున్నదంతా ఎన్నికల ముందు జిమ్మిక్కు. దానివల్ల తనకెలాంటి ఇబ్బంది లేదు కానీ ఇతర మతాల ప్రజలను పట్టించుకోవడంలేదు'. 'తాను జీవించి ఉన్నంతవరకు హిందువులు, ముస్లింల మధ్య వివక్షను అనుమతించను. నన్ను రకరకాల దేవాలయాల గురించి అడుగుతూనే ఉంటారు. దాని గురించి నేనేమీ చెప్పలేను. మతం వ్యక్తిగత సమస్య, పండుగలు ప్రతి ఒక్కరికి సంబంధించినవి. 22న జరగబోయే ర్యాలీలో పాల్గొనేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఆ రోజున తమ పార్టీలోని ప్రతి సభ్యుడు మధ్యాహ్నం 3 గంటలకు ర్యాలీ తీస్తారని' దీదీ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed