తాజ్ ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంలో ప్రయాణికులు సురక్షితం

by Harish |
తాజ్ ఎక్స్‌ప్రెస్ అగ్నిప్రమాదంలో ప్రయాణికులు సురక్షితం
X

దిశ, నేషనల్ బ్యూరో: సోమవారం తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని సరితా విహార్‌ వద్ద రైళ్లోని మూడు బోగిల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వారు కోచ్‌ల నుంచి బయటకు రావడంతో ఎవరూ గాయపడలేదు. వారంతా కూడా సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి మాట్లాడుతూ, తాజ్ ఎక్స్‌ప్రెస్ రైలులోని మూడు కోచ్‌లలో మంటలు చెలరేగాయని సాయంత్రం 4.24 గంటలకు కాల్ వచ్చింది. వెంటనే ఎనిమిది ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చి సాయంత్రం 5.43 గంటలకు మంటలను ఆర్పివేశామని తెలిపారు. అగ్ని ప్రమాదంలో D3, D4 కోచ్‌లు దెబ్బతిన్నాయని, D2 పాక్షికంగా దెబ్బతిందని, ప్రయాణికులు త్వరగా కోచ్‌ల నుంచి దిగడంతో ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు.

నార్తర్న్ రైల్వే జనరల్ మేనేజర్ శోభన్ చౌదరి మాట్లాడుతూ, తుగ్లకాబాద్-ఓఖ్లా మధ్య ప్రయాణించే తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో నాన్ ఏసీ చైర్ కార్ D3 కోచ్ నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అవి మరో రెండు కోచ్‌లకు వ్యాపించగా, రైలును సరితా విహార్‌ వద్ద నిలిపివేశారు. రైలు రన్నింగ్‌లో ఉన్న సమయంలో కూడా కొంతమంది ప్రయాణికులు క్రిందికి దూకారు, ఈ ఘటనలో ఎవరికి ఏం జరగలేదు, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోడానికి పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story