మధ్యంతర బడ్జెట్ ‘హల్వా వేడుక’లో ఆర్థిక మంత్రి నిర్మల.. ఏమిటీ వేడుక ?

by Hajipasha |
మధ్యంతర బడ్జెట్ ‘హల్వా వేడుక’లో ఆర్థిక మంత్రి  నిర్మల.. ఏమిటీ వేడుక ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశను సూచిస్తూ బుధవారం సాయంత్రం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఈ హల్వా తయారీ ప్రక్రియలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక కడాయిలోని హల్వాను ఆర్థికశాఖ అధికారులకు పంచారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాద్ కూడా పాల్గొన్నారు.


రాబోయే బడ్జెట్ సమాచార గోప్యతను నిర్వహించడానికి, పార్లమెంటులో సమర్పించే వరకు ఎటువంటి లీక్‌లు జరగకుండా నిరోధించడానికి లాక్ ఇన్ ప్రక్రియను కేంద్ర ఆర్థికశాఖ పాటిస్తుంది. బడ్జెట్ తయారీతో ముడిపడిన లాక్-ఇన్ ప్రక్రియ ప్రారంభమైంది అనేందుకు సూచకంగా హల్వా వేడుకను నిర్వహిస్తారు. బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ హల్వాను పంపిణీ చేస్తారు. హల్వా వేడుక ముగిసిన తర్వాతి నుంచి ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించే వరకు సంబంధిత అధికారులు, సిబ్బంది ఆర్థిక శాఖ కార్యాలయంలోనే ఉంటారు.

Advertisement

Next Story