Family members killed: ఇద్దరు చిన్నారులతో సహా కుటుంబ సభ్యుల హత్య..హర్యానాలో ఓ మాజీ జవాన్ ఘాతుకం

by vinod kumar |
Family members killed: ఇద్దరు చిన్నారులతో సహా కుటుంబ సభ్యుల హత్య..హర్యానాలో ఓ మాజీ జవాన్ ఘాతుకం
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని అంబాలాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ సైనికుడు ఇద్దరు చిన్నారులతో సహా తన కుటుంబంలోని ఐదుగురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. నారాయణగఢ్‌లోని రాటర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..రిటైర్డ్ సైనికుడు భూషణ్‌ కుమార్‌కు అతని సోదరుడు హరీశ్‌తో భూమి విషయంలో కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. పలు మార్లు ఇద్దరికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే హరీశ్ పై కోపం పెంచుకున్న భూషణ్ ఆదివారం రాత్రి తన సోదరుడి ఇంట్లోకి వెళ్లి కిరాతకానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులంతా నిద్రిస్తుండగానే గొడ్డలితో నరికి చంపాడు. మొదట తన సోదరుడిని హత మార్చిన నిందితుడు ఆతర్వాత ఒక్కొక్కరిని చంపేశాడు.

హత్య చేసిన అనంతరం మృతదేహాలను కూడా కాల్చేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన తన తండ్రిపైనా దాడికి పాల్పడగా ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అంబాలా పోలీస్ సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ అర్థరాత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మృతులను భూషణ్ తల్లి సరూపీ దేవి (65), సోదరుడు హరీశ్ (35), అతని భార్య సోనియా (32), వారి ఇద్దరు పిల్లలు యాషిక (5), మయాంక్ (6)గా గుర్తించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story