Fake Doctors: సూరత్‌లో నకిలీ మెడికల్ డిగ్రీ రాకెట్..13 మంది అరెస్ట్

by S Gopi |
Fake Doctors: సూరత్‌లో నకిలీ మెడికల్ డిగ్రీ రాకెట్..13 మంది అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ మెడికల్ డిగ్రీలను విక్రయిస్తున్న రాకెట్‌ను సూరత్ పోలీసులు గురువారం ఛేదించారు. ఈ రాకెట్‌కు సూత్రధారితో పాటు నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించి డాక్టర్‌లుగా పనిచేస్తున్న వారితో సహా మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. ఈ నకిలీ వైద్యులు రూ. 60,000 నుంచి రూ. 80,000 వరకు చెల్లించి డిగ్రీ సర్టిఫికేట్‌లను కొనుగోలు చేశారని, నిందితులలో ఎక్కువ మంది తమ 12వ తరగతిని కూడా క్లియర్ చేయలేదని పోలీసులు తెలిపారు. సూరత్ నివాసి రాసేష్ గుజరాతీ ఈ కేసుకు సూత్రధారిగా గుర్తించారు. బీకే రావత్ అనే వ్యక్తి సహాయంతో గత కొన్నేళ్లుగా ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లను 1,500 మందికి పైగా నకిలీ డిగ్రీలను చాలా మందికి జారీ చేసినట్లు వెల్లడైంది.

సూరత్‌లోని పండేసరా ప్రాంతంలో క్లినిక్‌లు నడుపుతున్న పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని దాడులు నిర్వహించి అరెస్టు చేశారు. వారు గుజరాతీ జారీ చేసిన బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతి మెడికల్ సైన్స్ (బీఈఎంఎస్) సర్టిఫికెట్ల నకిలీ డిగ్రీల ఆధారంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మరో నిందితుడు అహ్మదాబాద్‌లో నివసిస్తున్న బీకే రావత్‌గా గుర్తించారు. ఎటువంటి అవగాహన, శిక్షణ లేకుండానే నిందితులు అల్లోపతి మందులు ఇస్తున్నారని పోలీసు వర్గాలు గుర్తించాయి. ఇలా వందల సంఖ్యలో నకిలీ వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్‌లు నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పందేసరలోని మూడు క్లినిక్‌లపై దాడులు నిర్వహించినట్లు జోన్-4 డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ గుజరాత్ మీడియా సమావేశంలో తెలిపారు. నిందితులు నకిలీ వైద్యులు తమ బీఈఎంఎస్ సర్టిఫికెట్లను చూపించారు. వాటికి గుజరాత్ ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపులేదు. ఈ పట్టాలు నకిలీవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కూడా నిర్ధారించిందని చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుజరాతీ, రావత్, ఇతరులు నకిలీ సర్టిఫికేట్లను ఇవ్వడమే కాకుండా ఆ వైద్యుల నుంచి ఏటా రూ.5,000 నుంచి రూ.15,000 వరకు రెన్యూవల్ ఛార్జీల పేరుతో వసూలు చేస్తున్నారు.

Advertisement

Next Story