ఫడ్నవీస్‌పై సంచనల ఆరోపణలు చేసిన కోటా ఉద్యమ నేత జరాంగే

by S Gopi |
ఫడ్నవీస్‌పై సంచనల ఆరోపణలు చేసిన కోటా ఉద్యమ నేత జరాంగే
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్‌పై మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమ నేత మనోజ్‌ జరాంగే సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. ముంబైకి మార్చ్‌గా వెళ్లి ఫడ్నవీస్ నివాసం ఎదుట నిరసన చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. 'నాపై తప్పుడు ఆరోపణలు చేయమని కొంతమందిని ప్రలోభపెడుతున్నారు. వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ కుట్రల వెనుక ఫడ్నవీస్ ఉన్నారు. నన్ను చంపాలనుకుంటున్నారని' మనోజ్ తెలిపారు. జాల్నాలోని అంతర్వాలి సారతిలో జరిగిన కార్యక్రమంలో మనోజ్ జరాంగె వ్యాఖ్యలు సంచలనం రేపాయి. భారీ సంఖ్యలో అతని మద్దతుదారుల మధ్య ఈ ప్రకటన గందరగోళానికి దారితీసింది. కొందరు జరాంగేను నివారించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఒంటరిగా ముంబైకి కవాతు చేస్తానని ప్రకటించారు. మనోజ్ జరాంగే వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే, ఫడ్నవీస్ వద్దకు వెళ్లాలంటే పార్టీ కార్యకర్తలతో కూడిన భారీ గోడను జరాంగే దాటవలసి ఉంటుందన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలి కానీ, ఫడ్నవీస్‌పై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారకూడదని రాణే అన్నారు. మనోజ్ జరాంగే అసలు రూపం ఇప్పుడే బయటపడిందని ముంబై బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భత్ఖల్కర్ తెలిపారు.

Advertisement

Next Story