MEA: జైషే చీఫ్ మసూద్ అజార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్

by S Gopi |
MEA: జైషే చీఫ్ మసూద్ అజార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్, 2001 భారత పార్లమెంట్ దాడి సూత్రధారి మసూద్ అజార్ పాక్‌లో స్వేచ్ఛంగా తిరుగుతుండటంపై భారత్ తీవ్రంగా ఖండించింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇటీవల పాకిస్తాన్‌లో జరిగిన ఓ ఇస్లామిక్ కార్యక్రమంలో బహిరంగంగా ప్రసంగించిన మసూద్, భారత్‌పై దాడులు కొనసాగిస్తామని చెప్పాడు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీని అవమానించే వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారానికి సంబంధించి పాక్ తీరుపై భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. శుక్రవారం భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. మసూద్ అజార్ పాక్ బహిరంగ సభలో ప్రసంగించిన కథనాలు నిజమైతే ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించడంలో పాకిస్తాన్ ద్వంద వైఖరి తేటతెల్లమైనట్టేనని అన్నారు. అతడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, కోర్టు ముందు నిలబెట్టాలన్నారు. గతంలో మసూద్ తమ దేశంలో లేరని పాకిస్తాన్ పదే పదే అబద్దాలు వల్లెవేసిందని ఆయన పేర్కొన్నారు. మసూద్ అజార్ తన ఆవేశపూరిత, రెచ్చగొట్టే ఉపన్యాసాలకు పేరుగాంచాడు. భారత, ఇజ్రాయెల్‌లను లక్ష్యంగా చేసుకుని జిహాదీ కార్యకలాపాలను పునరుద్ధరిస్తానని ఇటీవల ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రసంగం ఈ ఏడాది నవంబర్‌లో చేసినట్టు సమాచారం.

Advertisement

Next Story