Exit polls: కాంగ్రెస్ ఈజ్ బ్యాక్.. జమ్ము కశ్మీర్, హర్యానాలో హవా

by Gantepaka Srikanth |
Exit polls: కాంగ్రెస్ ఈజ్ బ్యాక్.. జమ్ము కశ్మీర్, హర్యానాలో హవా
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ము కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటినట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వేస్తున్నాయి. హర్యానా, జమ్ము కశ్మీర్‌లలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమున్నదని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది.

90 స్థానాలున్న హర్యానాలో హస్తం కూటమికి 49 నుంచి 61 స్థానాలు దక్కుతాయని, బీజేపీకి 32 సీట్లకే పరిమితం అవుతుందని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఇక జేజేపీ ఒక్క సీటు గెలుచుకోవడమే కష్టమని పేర్కొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం 90 సీట్లల్లో బీజేపీ 40 కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 31 స్థానాలు, జేజేపీ 10 సీట్లను గెలుచుకున్నాయి. జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రెండు పర్యాయాలు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. ఇటీవలే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హర్యానాలోని పది స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లో ఐదేసీ స్థానాలను గెలుచుకున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊరటనిచ్చింది.

కశ్మీర్ కాంగ్రెస్ అలయెన్స్‌దే!

దశాబ్ద కాలం తర్వాత జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ప్రజలు కాంగ్రెస్ కూటమికే పట్టం కట్టే అవకాశం ఉన్నదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి 46 నుంచి 50 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది. జమ్ము కశ్మీర్‌లో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి మెజార్టీ మార్క్ 46ను సులువుగానే ఈ కూటమి అధిగమిస్తుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది.

తాజాగా ముగిసిన హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడనున్నాయి.

Advertisement

Next Story