తెలంగాణ భవన్‌లో సంబురంగా ‘బతుకమ్మ’

by Gantepaka Srikanth |
తెలంగాణ భవన్‌లో సంబురంగా ‘బతుకమ్మ’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ పాటలను ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. భవన్ కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, గొంగిడి సునీత మాట్లాడుతూ ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ అన్నారు. ఈ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు.

రాష్ట్ర ప్రజల జీవితాల్లో ప్రకృతి మాత బతుకమ్మ వెలుగులు నింపాలని ప్రార్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలమైందన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యిచూపిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మన్నె కవిత, సామల హేమలత, పద్మ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed