Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. సీఈసీ రాజీవ్ కుమార్ సూచన

by vinod kumar |
Exit polls: ఎగ్జిట్ పోల్స్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాలి.. సీఈసీ రాజీవ్ కుమార్ సూచన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎగ్జిట్ పోల్స్‌పై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ మీడియా సంస్థలకు సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ప్రకటించే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఎన్నికల ఫలితాలు వెల్లడించేటప్పుడు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభిస్తే తొలి రౌండ్ ఫలితం వచ్చేసరికి సుమారు 50 నిమిషాలు పడుతుందని, కానీ మీడియాలో మాత్రం నిమిషాల్లోనే ట్రెండ్స్ వెలువడుతున్నాయని, ఇది ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఈ విధమైన రిజల్ట్స్ పూర్తిగా నకిలీవని కాబట్టి ఎగ్జిట్ పోల్స్, మీడియా సంస్థలు తమ బాధ్యతలను అర్థం చేసుకోవాలని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా ఒక అంచనా ఏర్పడిన తర్వాత ఇది తీవ్ర గందరగోళానికి కారణమవుతుందని చెప్పారు.

ఎగ్జిట్ పోల్స్‌పై తమకు నియంత్రణ లేదని.. కానీ అంచనా వేసిన పరిమాణం ఎంత, సర్వే ఎక్కడ నిర్వహించారు? దాని ఫలితాలు ఎలా ఉన్నాయి? అనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అసలైన రిజల్ట్‌తో సరిపోలకపోతే ఎవరు బాధ్యత తీసుకోవాలని ప్రశ్నించారు. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం వెబ్ సైట్‌లో పోస్టు చేయడానికి సుమారు గంటన్నర సమయం పడుతుందని, వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని వాస్తవ ఫలితాలను విశ్లేషించాలని తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడగా ఫలితం మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed