ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు.. ప్రతీ పౌరుడికీ : సుప్రీంకోర్టు

by Hajipasha |   ( Updated:2024-03-07 18:43:19.0  )
ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు.. ప్రతీ పౌరుడికీ : సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : ‘‘ప్రతి విమర్శ నేరం కాదు. అలా అనుకుంటే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చట్టబద్ధంగా అసమ్మతిని వ్యక్తిపరిచే హక్కు ప్రజలకు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై ప్రతికూల వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర వ్యక్తిపై నమోదు చేసిన కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కాలేజీలో పనిచేస్తున్న కాశ్మీరీ ప్రొఫెసర్ జావెద్ అహ్మద్ హాజం పెట్టిన వాట్సాప్ స్టేటస్ అభ్యంతరకరంగా ఉండటంతో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆగస్టు 5 జమ్మూ కాశ్మీర్‌కు బ్లాక్ డే‌ అని సదరు కాశ్మీరీ ప్రొఫెసర్ అప్పట్లో వాట్సాప్ స్టేటస్‌లో ప్రస్తావించారు. ఆగస్టు 14న పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటానని ఆ మెసేజ్‌లో జావెద్ అహ్మద్ పొందుపరిచారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ‘‘ఆగస్టు 5వ తేదీని ‘బ్లాక్ డే’గా పిలిచి ఓ రకమైన వినూత్న నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం సద్భావన సంకేతం మాత్రమే. శత్రుత్వం, ద్వేషం వల్ల వచ్చేదేం ఉండదు’’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని వాడుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించాలన్నారు. దేశం/రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై విమర్శ చేసే హక్కు ప్రతీ పౌరుడికి ఉంటుందని సుప్రీం బెంచ్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed