Supreme Court : కసబ్ కేసు విచారణ న్యాయంగానే జరిగింది.. యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Supreme Court : కసబ్ కేసు విచారణ న్యాయంగానే జరిగింది.. యాసిన్ మాలిక్ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వేర్పాటువాది యాసిన్‌మాలిక్‌ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు(Supreme Court) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 26/11 ముంబై దాడుల కేసు నిందితుడు అజ్మల్‌ కసబ్‌(terrorist Ajmal Kasab) కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని అడిగింది. యాసిన్‌ మాలిక్‌(separatist leader Yasin Malik) వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్‌ కోర్టు ఆదేశాలను.. సీబీఐ(CBI) సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. దీనిపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, యాసిన్ మాలిక్ విచారణ కోసం జైలులోనే కోర్టును ఏర్పాటు చేయవచ్చన్న సీబీఐ వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. కాగా.. ఎంతమంది సాక్షులు హాజరవుతారో, వారి భద్రతా ఏర్పాట్లను తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరింది. ఈ కోర్టు కోసమే జడ్జిని ఎలా జైలులో పెట్టిస్తారో చూడాలని అంది. దీనిపై, తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

కేసులు ఏంటంటే?

ఇకపోతే, 1990లో శ్రీనగర్‌ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బంది హత్య కేసులో ప్రధాన నిందితుడిగా యాసిన్ మాలిక్ ఉన్నాడు. అలానే, 1989లో రుబయా సయీద్‌ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌) కిడ్నాప్‌ కేసులోనూ నిందితుడిగా తేలాడు. అలాగే.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే, ఉగ్రలింకుల కేసులో మాలిక్‌ను వ్యక్తిగతంగా హాజరు కావాలని జమ్ముకశ్మీర్ కోర్టు కోరింది. మాలిక్ కూడా వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా చెప్పాడు. అయితే, యాసిన్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతే జమ్ముకశ్మీర్ లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని సీబీఐ పేర్కొంది. అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని జమ్ముకశ్మీర్ కోర్టు ఆదేశాలను సీబీఐ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపైనే ధర్మాసనం విచారణ జరిపింది.

Advertisement

Next Story

Most Viewed