ఒక శకం ముగిసింది: మన్మోహన్ రిటైర్మెంట్‌పై ఖర్గే స్పందన

by Swamyn |
ఒక శకం ముగిసింది: మన్మోహన్ రిటైర్మెంట్‌పై ఖర్గే స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం బుధవారం(ఏప్రిల్ 3)తో ముగియనుంది. దీంతో 33 ఏళ్ల సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా కొనసాగిన ఆయన ప్రస్థానానికి తెరపడింది. దీనిపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే స్పందిస్తూ, మన్మోహన్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘‘మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన మీరు.. రాజ్యసభ నుండి పదవీ విరమణ చేయడంతో ఒక శకం ముగిసింది. మీ కంటే ఎక్కువ అంకితభావం, భక్తితో దేశానికి సేవ చేశామని చాలా తక్కువ మంది మాత్రమే చెప్పగలరు. ప్రజల కోసం మీరు చేసిన సేవ మరువలేనిది. మీ మంత్రివర్గంలో భాగమవడం నాకు దక్కిన గౌరవం. కొన్నేళ్లుగా వ్యక్తిగత అసౌకర్యాలు ఉన్నా కాంగ్రెస్‌ పార్టీకి అందుబాటులో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతాం. దేశంలోని అన్ని వర్గాలకూ సమానంగా ప్రయోజనకరమైన ఆర్థిక విధానాలను అనుసరించడం సాధ్యమవుతుందని మీరు చూపించారు. పేదలు కూడా దేశాభివృద్ధిలో పాలుపంచుకోవచ్చని, పేదరికం నుండి బయటపడగలరని చూపించిందీ మీరే. మీరు ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన విధానాలతో భారతదేశం 27కోట్ల మందిని, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేదలను పేదరికం నుండి బయటపడేయగలిగింది. మీ హయాంలో ప్రారంభించిన ‘వంద రోజుల పని’ పథకం సంక్షోభ సమయాల్లో గ్రామీణ కుటుంబాలకు ఉపశమనాన్ని అందిస్తూనే ఉంది. దేశానికి మీరు చేసిన ఎనలేని కృషికి క్రెడిట్ ఇవ్వడానికి ప్రస్తుత నాయకులు ఇష్టపడరు. వ్యక్తిగతం లేకుండా విమర్శించడం సాధ్యమని మీరు చూపించారు. ప్రస్తుత ప్రభుత్వ అబద్ధాలను ప్రజలు త్వరలో చూస్తారు. సూర్యచంద్రులను ఎలా దాచలేమో, సత్యాన్ని కూడా దాచలేము. ప్రజలు మీ మాటల ప్రాముఖ్యతను త్వరలోనే గుర్తిస్తారు. మీరు క్రియాశీలక రాజకీయాల నుండి రిటైర్ అవుతున్నప్పటికీ, వీలైనంత తరచుగా దేశ పౌరులతో మాట్లాడటం ద్వారా దేశానికి వివేకం, నైతిక దిక్సూచిగా కొనసాగుతారని ఆశిస్తున్నాను’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.


Advertisement

Next Story